సోనికా రెడ్డి ఆత్మహత్య కు ఫోన్ వేధింపులే కారణం

నిర్మల్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత సోనికా రెడ్డి ఆత్మహత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోనికా రెడ్డి బుధవారం నిర్మల్ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పూర్తి వివరాలు ఏంటంటే…

నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సోనికారెడ్డికి కుంటాల మండలం తిమ్మాపూర్ కు చెందిన ఉదయ్ కిరణ్ రెడ్డితో మూడేళ్ల క్రితం వివాహమైంది. అతను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండడంతో భార్య భర్తలు హైదరాబాద్ లోనే ఉండేవారు. అయితే భార్య భర్తల మధ్య గత కొంత కాలంగా విబేధాలు నడుస్తున్నాయి. దీంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇంతలోనే ఉదయ్ కిరణ్ రెడ్డి ఉద్యోగం మానేశాడు. దీంతో సోనికారెడ్డి నిర్మల్ వచ్చి అమ్మగారింట్లో ఉంటోంది.

అయినా కూడా ఉదయ్ కుమార్ సోనికాను ఫోన్ లో మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఇటీవల ఫోన్ లో కూడా వారికి ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. సోనికారెడ్డి గతంలోనే వివాహం జరిగిందని ఉదయ్ కుమార్ తో ఆమెకు రెండో పెళ్లి అని తెలుస్తోంది. మొదటి భర్తతో కూడా విబేధాల వల్లనే విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పెళ్లి అచ్చి రాకపోవడం, రెండో పెళ్లి చేసుకుంటే అది కూడా ఆనందంగా లేదన్న వేదనతో సోనికా రెడ్డి కుంగిపోయిందని బంధువులు తెలిపారు.

బుధవారం ఉదయం నిర్మల్ లోని శ్రీ బాలాజీ అపార్ట్ మెంట్ లో ఉంటున్న బంధువులను కలిసేందుకు సోనికా రెడ్డి వచ్చింది. వారితో మాట్లాడిన తర్వాత అపార్ట్ మెంట్ ఐదో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సవుండ్ కు అంతా వచ్చి చూసే సరికే సోనికా రెడ్డి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. తమ కూతురు చనిపోవడానికి అల్లుడు ఉదయ్ కుమార్ వేధింపులే కారణమని పోలీసులకు సోనికారెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.