టిక్ టిక్ టిక్.. మరికొద్ది గంటల్లో ప్రణయ్ కేసు గుట్టు రట్టు

మిర్యాలగూడెంలో సంచలనం రేపిన పరువు హత్య కేసు వివరాలను మంగళవారం మధ్యాహ్నాం నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ రంగనాథ్ వివరాలు వెల్లడించనున్నారు. అయితే ప్రణయ్ హత్య కేసులో విచారించిన కొద్ది సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.

ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితునిగా మారుతీరావు, ఏ2 నిందితునిగా మారుతీరావు సోదరుడు శ్రావణ్ ఉన్నారు. వీరితో పాటు భారీ, షఫీ, కరీంలు సూత్రధారులుగా ఉన్నారు. హత్య చేసిన వ్యక్తి భారీగా పోలీసులు గుర్తించారు. మారుతీరావు ఈ హంతక ముఠాకు 1 కోటి రూపాయలకు డీల్ చేసుకున్నాడు. ముందుగా రూ.18 లక్షలు చెల్లించాడు. పని అయిన తర్వాత మిగిలిన 82 లక్షలు చెల్లించేలా డీల్ చేసుకున్నాడు.

భారీ ఐఎస్ ఐ ఏజంట్ మరియు హలేక్ పాండ్యన్ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో చర్లపల్లి జైలులో శిక్ష కూడా అనుభవించాడు. పక్కా ఆధారాల కోసమే కోర్టులో హాజరు పరుచడం ఆలస్యమైందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, కుల, పరువు హత్య కావడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పక్కా ఆధారాలతో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం మారుతీరావు, శ్రావణ్, కరీం, షఫీలు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు భారీ పరారీలో ఉన్నాడు. భారీ కోసం పోలీసుల నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హత్య జరగడానికి అరగంట ముందు మారుతీరావు వేములపల్లి కట్టమీద మిర్యాలగూడ డీఎస్పీ తో మాట్లాడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం లేదని  ఎస్పీ ఇప్పటికే  ప్రకటించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నాం ఎస్పీ ఏం విషయాలను వెల్లడించబోతున్నారో అని అంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.