టిడిపి నేతలను వెంటాడుతున్న యాక్సిడెంట్లు…

తెలుగు దేశం పార్టీని యాక్సిడెంట్లు వెంటాడుతున్నాయా… పలువురు తెలుగుదేశం నాయకులు రోడ్డు ప్రమాదాలలో దుర్మరణం పాలయ్యారు. మరణించిన వాళ్లంతా చాలా పెద్ద నాయకులు, నిజంగా వారిలోటు పూరేది కాదు. పార్టీకి ఒక విధంగా చాలా పెద్ద నష్టం ఇది.

మొన్నామధ్య ఎన్టీఆర్ కుమారుడు,టిడిపి నేత నందమూరి హరికృష్ణ హైదరాబాద్ సమీపంలో ఘోరమయిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

2012 నవంబర్ రెండో తేదీన టిడిపికి ఉత్తరాంధ్రలో కొండంత అండగా ఉండిన మాజీ ఎంపి కింజారపు ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు.

ఆతర్వాత 2013 లో మాజీ రాజ్యసభ సభ్యుడు, గుంటూరు జిల్లాకు చెందిన మైనారిటీ నాయకుడు, లాల్‌జాన్ భాషా కూడా రోడ్డు ప్రమాదానికే బలయ్యారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నపుడు ఆయన కారు ప్రమాదానికి లోనయింది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రి సమీపంలోనే కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బాష అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి హరికృష్ణ ప్రమాదానికి పోలిక గమనించండి.

2014లో పార్టీ ఒక ముఖ్యమయిన నాయకురాలిని కోల్పోయింది. కర్నూలు జిల్లాకు చెందిన భూమా శోభానాగిరెడ్డి కూడా కారు ప్రమాదంలోనే మరణించారు. ఒక సమావేశానికి వెళ్లి వస్తున్నపుడు ఆమె ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు మీద ఉన్నవరికుప్పలను తప్పించబోయి బోల్తాపడడంతో ప్రమాదం జరిగింది.

 

ఇక 2014 లోనే మరొక విషాద సంఘటన జరిగింది. హరికృష్ణ కుమారుడు జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల సమీపంలో ఆకుపాముల వద్ద జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. జానకిరాం టిడిపి నేత కాకపోయినా, టిడిపి ఫ్యామిలీకి ఇది విషాద సంఘటనే. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఆయనే నడుపుతున్నకారు ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.జానకిరామ్ అక్కడిక్కడే మరణించాడు.. ఆయన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323. హరికృష్ణ కారు నెంబర్ ఏపీ 28బీడబ్ల్యూ 2323.

2017లో హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో టిడిపి ఏపీ మంత్రి నారాయణ ఒక ఘోరమయిన రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయారు. ఆయన కుమారుడు నిషిత్ నారాయణ(23) కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ మరణించారు.


ఇపుడు తాజాగా అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఉత్తరాంధ్రకే చెందిన ప్రముఖ టిడిపి నాయకుడు ఎం వి విఎస్ మూర్తి మరణించారు.

మరణించినంతా వాళ్లంతా సీనియర్ నాయకులే.