ప్రేమ పెళ్ళి, మరో పెళ్ళి, హత్య, మిస్టరీ, చివరికిలా..

నచ్చిన వాడిని పెండ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ అక్క జాడ కోసం ఆ తమ్ముడు భగీరథ ప్రయత్నమే చేశాడు. తోడ బుట్టిన ప్రేమతో ఏండ్ల తరబడి వెతికాడు. ఆమె ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. తన అక్క పిల్లలతో ఆడుకోవాలని ఆరాటపడ్డాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. కానీ అతని ఆశలు మాత్రం అడియాశలు అయ్యాయి. బావ కూడా అతన్ని నమ్మించాడు. కానీ అతనికి ఎక్కడో అనుమానం తట్టింది. అక్క లేని నిజాన్ని తెలుసుకొని ఇంటలిజెన్స్ లా విచారించాడు. అసలు ఏం జరిగిందని శోధించాడు.ఇంతకీ ఎవరా తమ్ముడు, ఎవరా అక్క. బావ చేసిన నేరమేమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రియాంక 

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం మాండ్ర  గ్రామానికి చెందిన ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి ఎల్ బీనగర్ లోని మజీద్ గల్లీలో ఉండేవారు.వండ్రంగి పని చేసుకుంటూ వారు జీవనం సాగించేవారు. మర్రిగూడెం మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మొరా హనుమంతు క్రూజర్ డ్రైవర్ గా పనిచేస్తూ అదే గల్లీలో కిరాయికి ఉండేవాడు. ప్రియాంకతో హనుమంతు పరిచయం పెంచుకున్నాడు.  మూడు నెలల్లోనే ప్రియాంకను ముగ్గులోకి దింపాడు. అది ప్రేమ పెళ్లి కి దారి తీసింది. ఇంట్లో కుటుంబసభ్యులకు ఎవరికి తెలియకుండానే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాదులోనే మరో చోట కాపురం పెట్టారు. కుటుంబ సభ్యులు వెతికినా వీరి జాడ కనిపించలేదు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. వీరి కాపురానికి ఒక పాప, బాబు  పుట్టారు.

2009 లో హనుమంతు ప్రియాంకకు తెలియకుండా వారి కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి  చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తున్నానని ప్రియాంకను నమ్మిస్తూ అటూ ఇటూ వచ్చి వెళ్తుండేవాడు. ఈ  క్రమంలో అనుమానం వచ్చిన ప్రియాంక హనుమంతును నిలదీసింది. దీంతో ప్రియాంకను ఎలాగైనా వదిలించుకోవాలని హనుమంతు పన్నాగం పన్నాడు. 2009లో ప్రియాంక తన సోదరుడు ఉపేందర్ కు కనిపించింది. వారింటికి తన సోదరున్ని తీసుకెళ్లింది. ఇంట్లో కూడా ఏమి అనరు త్వరలోనే నిన్ను తీసుకెళతానని ప్రియాంకతో ఉపేందర్ చెప్పాడు. మరో నాలుగు రోజుల తర్వాత ఉపేందర్ వారింటికి రాగా వారింటికి తాళం వేసి ఉంది. తన కుటుంబ సభ్యులు గ్రామంలో లేని సమయంలో హనుమంతు ప్రియాంకను వెంకెపల్లి గ్రామానికి తీసుకెళ్లాడు. రాత్రి  సమయంలో ప్రియాంకను హత్య చేసి మృత దేహాన్ని మర్రిగూడ వెళ్లే దారిలో ఉన్న  ఓ పాడుబడ్డ బావిలో పడేశాడు. ఆ బావిలో చనిపోయిన జంతువులు, కుక్కల, బర్రెలను వేసేవారు. దాంతో అందులో నుంచి వాసన వచ్చినా ఎవరూ కూడా అనుమానించలేదు. ఇద్దరు పిల్లల్లో పాపను అమ్మేసి బాబును చుట్టాలవారికి పెంచుకోవడానికి ఇచ్చాడు.అంతా సద్దుమణిగిందని రెండో భార్యతో కాపురం చేస్తు ఆనందంగా హనుమంతు ఉన్నాడు. ప్రియాంక లేదనే బాధతో ప్రియాంక తండ్రి చనిపోయాడు. ప్రియాంక కుటుంబ సభ్యులు ఆందోళనతో సతమతమయ్యారు.

రెండో భార్య, పిల్లలతో హనుమంతు 

ఇంతలో హనుమంతు తన రెండో భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు ఫేసుబుక్ లో పెట్టాడు. ఫేసుబుక్ లో పెట్టిన ఫోటోలు ఉపేందర్ చూశాడు.తన అక్క స్థానంలో మరో అమ్మాయి ఉండటంతో అనుమానించాడు. తన అక్క ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాడు.హనుమంతు స్వగ్రామం వెంకెపల్లి అని తెలుసుకొని అక్కడ విచారించాడు.పూర్తి సమాచారం దొరకలేదు.  ఫేసుబుక్ లో తన బావ స్నేహితులను సంప్రదించాడు.  కొంత మేరకు వివరాలు తెలుసుకున్నాడు. తన విచారణలో అక్కను బావ చంపేశాడని, పిల్లలను అమ్మేశాడని నిర్ధారించుకున్నాడు.

పోలీస్ స్టేషన్‌లో రోధిస్తున్న ప్రియాంక తల్లి, సోదరుడు ఉపేందర్ 

దీనిపై మూడు రోజుల క్రితం ఎల్బీనగర్, మర్రిగూడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు.ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నాంపల్లి సీఐ కె.ప్రభాకర్ రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు హనుమంతును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రియాంకను తానే చంపానని విచారణలో హనుమంతు వెల్లడించాడు.ప్రియాంకను పడేసిన వ్యవసాయబావి వద్ద శవం వెలికితీత కోసం చర్యలు చేపట్టారు. ఇంకా శవం ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఊరోళ్లు బావి దగ్గరకు తండోపతండాలుగా వచ్చారు. ప్రియాంకను చంపిన దుర్మార్గుడు హనుమంతును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ ఉన్నారనే దానిపై మరో పోలీసు టీం సెర్చ్ చేస్తుంది. ఉపేందర్ చేసిన విచారణకు పోలీసులు కూడా అభినందనలు తెలిపారు. అక్క లేదనే బాధతో ఉపేందర్, తల్లి కుప్పకూలిపోయారు. వారిని చూసి పలువురు స్థానికులు కూడా కంటతడి పెట్టారు.