20 వేల కోసం బీర్ బాటిల్ తో స్నేహితుడి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు..!

ప్రస్తుత కాలంలో డబ్బుకున్న ప్రాధాన్యత బాంధవ్యాలకు లేకుండా పోయింది. డబ్బు కోసం కొంతమంది ప్రజలు ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. ఆఖరికి బంధువులు, స్నేహితులు తోడబుట్టిన వారు అని చూడకుండా డబ్బు, ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణమైన సంఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. 20వేల రూపాయలు అప్పు ఇవ్వలేదని స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు ఒక దుర్మార్గుడు.

వివరాల్లోకి వెళితే… జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని చిన్నపాడుకు చెందిన 24ఏళ్ల సాయికుమార్ గద్వాల పట్టణానికి చెందిన శ్రీకాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు . ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు ఏం చేసినా కలిసి చేసేవారు. ఎన్నో ఏళ్లుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి మధ్య డబ్బు చిచ్చు రేపి స్నేహితుడి ప్రాణాలు తీసేలా చేసింది. ఎప్పటిలాగే ఇద్దరు కలసి తిరిగేవారు. మే 13వ తేదీన బయటికివెళ్లిన సాయికుమార్ ఇంటి తిరిగి రాలేదు. దీంతో సాయి కుమార్ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెదికినా అతని ఆచూకీ లభించకపోవడంతో సాయికుమార్ తండ్రి నర్సింలు జూలై 3వ తేదీన ధరూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో రేవులపల్లి చేపల దుకాణం దగ్గర సాయికుమార్ బైక్ ని గుర్తించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రేవులపల్లి చేరుకొని ద్విచక్ర వాహనం ఉన్న వ్యక్తిని విచారించగా శ్రీకాంత్ ద్విచక్ర వాహనాన్ని కొదవ పెట్టి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడని అతను వెల్లడించాడు. ఈ ఘటనలో పోలీసులు శ్రీకాంత్ మీద అనుమానం ఉండటంతో రెండు రోజుల క్రితం అతని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. ఈ విచారణలో శ్రీకాంత్ సాయి కుమార్ ని తానే చంపినట్లు అంగీకరించాడు. 20వేల రూపాయలు అప్పుగా ఇవ్వటానికి నిరాకరించిన సాయికుమార్ ని శ్రీకాంత్ బీర్ బాటిల్ తో గొంతులో పొడిచి చంపినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకుండా సాయికుమార్ మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంటలో వేసి మట్టి రాళ్లు వేసి పూడ్చి పెట్టాడని తెలియచేశాడు. దీంతో పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని మరిన్ని విషయాల గురించి విచారిస్తున్నారు.