తుగ్గలి : కర్నూలు జిల్లా ట్రాజెడీ హబ్ (T-Hub)

 

తుగ్గులి కర్నూలు  జిల్లాలో చిన్న మండలం. చెన్నై ముంబాయి రైలు మార్గంలో ఉండే చిన్న రైల్వే స్టేషన్.  వూరి జనాభా అయిదు వేలు మించదు.  పెద్ద గా ప్రాముఖ్యం లేని వూరు .అయితే, తుగ్గలి  చాలా చిత్రమయిన మండలం. బతుకు బాగుపడుతుందన్న ఆశ, బాగుపడని నిరాశ తుగ్గులిలో  రెండు ఆకారాల్లో కనిపించి భయపెడుతుంది. అవి ఒకటి.  వజ్రాల వేట. 

తిండితిప్పల్లేకుండా సాగుతున్న వజ్రాల వేట

రెండు కరువు.  వజ్రాల  కోసం పొట్ట చెత్తో పట్టుకుని ఇక్కడి కొచ్చే పేదరైతులు ఎందరో. అదే విధంగా   వర్షాలు లేక పంటలు రాక  కరువు నుంచి బయటపడేందుకు బయటకు వెళ్లే రైతులు రెండో రకం.

ఛలో గుంటూరు… అక్కడ కూలి గ్యారంటీ.

పంటలు విఫలమయినపుడు రైతులు  ఈ ప్రాంతంనుంచి గుంటూరు, విజయవాడ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వలస పోతుంటారు.  అందుకే తుగ్గులి కర్నూలు జిల్లాలో ఒక ట్రాజెడీ హబ్  (టి-హబ్).

 

వర్షాలు పడగానే జిల్లాలోని ఇతర ప్రాంతాలనుంచే కాదు, పక్కనున్న అనంతపురం, అటువైపున్న కర్నాటక  రాష్ట్రం నుంచి వేలాది మంది రైతులు ఈ ఇక్కడి పొలాల మీద మిడతల దండులా పడతారు. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయని ఆశ.  వర్షం పడగానే మట్టి కొట్టుకుపోయి వజ్రాలు తేలుతాయని వీరి నమ్మకం.  ఒక వజ్రం దొరికినా జీవితం రాత్రికి రాత్రి మారిపోతుంది.  ప్రతిసీజన్ లో  తుగ్గులిలో పేరు తెలియని  రైతొకరికి వజ్రం దొరికిందని, దానిని బొంబాయికి చెందిన వజ్రాల వ్యాపారి ఒకరు  లక్షలకు కొనుగోలు చేశాడనే వార్త వస్తుంది. అంతే, వర్షా కాలమంతా వజ్రాల మీద  ఆశతో ఈ ప్రాంతానికి వచ్చి తినితినక  పోలాల్లో మెరిసే ప్రతి రాయిని వజ్రమనుకుని ఏరుకుంటూంటారు.

ఒక వేళ ఇవే వర్షాలు ఫెయిలయితే…  ఈ కథని తుగ్గులి రైల్వే స్టేషన్ చక్కగా చెబుతూంది. వర్షాలు ఫెయిలయితే సీన్ రివర్స్ అవుతుంది.  తుగ్గులి,చుట్టూర ఉన్న ప్రాంతాలనుంచి బతకు దెరువు కోసం బయటకుపోవడం మొదలవుతుంది. రోజూ ఒక డజన్  ప్రయాణికులకు మించి కనిపించని తుగ్గని రైల్వే స్టేషన్ కరువు బాధితులతో కిటకిట లాడటం మొదలవుతుంది. పోలోమని రోజు వందల  సంఖ్యలో గుంటూరు రైలెక్కుతారు. 

అక్కడ రాజధాని నిర్మాణ ాల్లోనో, ఇతర  కనస్ట్రక్షన్ ప్రాంతాల్లోనో కూలి దొరుకుతుందని ఆశ .  పిల్లలచేత బడిమానిపించేసి  పెట్టెబేడ సర్దుకుని వలస పోతారు. పిల్లల చదువు పాడై పోతుందన్న బెంగ లేదు. చదువు కంటే బతుకేముఖ్య మని వాదిస్తారు.  ఈ ఏడాది  కర్నూలు జిల్లాలో కరువు భయంకరంగా ఉంది. వర్ష పాతం 50 శాతం తక్కువగా ఉంది. దీనితో పంటలు పడలేదు. పడినవి ఎండిపోయాయి.  వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది.  ఇక్కడి నుంచి రైతులు వలసపోవడం  మొదలయింది. వారందరిని తుగ్గలి రైల్వే స్టేషన్ లో చూడవచ్చు.  

బతుకు దెరువుకోసం వజ్రాల వేటంటూ వచ్చే వారికి, బతుకు దెరువు వెతుక్కుంటూ గుంటూరు వెళ్లే వారికి తుగ్గలి హబ్ గా మారింది.