అమరావతి: ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు మంత్రులు అభినందించారు. సచివాలయంలోని ఆయన నూతన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఐటి మంత్రి నారాలోకేష్, పర్యాటక శాఖ భూమా అఖిల ప్రియ, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ లతో పాటు వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. శ్రావణ్, ఇటీవల మావోయిస్టులు హతమార్చిన అరకు టిడిపి శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుమారుడు.
కొత్తగా బాద్యతలు స్వీకరించిన సందర్బంగా మంత్రి నారాలోకేష్ శ్రావణ్‌ను కలిసి మాట్లాడుతూ చైనా పర్యటన ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో కిడారి సర్వేశ్వరరావుతో నియోజకవర్గం అభివృద్ది పనులపై మాట్లాడానని, కలిసి భోజనం చేశానని గుర్తుచేసుకున్నారు. శాఖ పరంగా, నియోజకవర్గ అభివృద్దికి సహకారం కావాలని శ్రావణ్ కుమార్ కోరగా మంత్రులందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామి ఇచ్చారు.