అప్పు చెల్లించమని అడిగిన మహిళను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి..!

ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేకుండా పోయింది. ఈ రోజుల్లో డబ్బు కోసం ఎటువంటి దారుణాలకైన పాల్పడటానికి వెనకాడటం లేదు. కొంతమంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు భరించలేక అప్పులు చేసి వాటిని తిరిగే తీర్చలేక ప్రాణాలను తీసుకుంటుంటే మరి కొంతమంది మాత్రం అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి భరించలేక వారి ప్రాణాలను తీయటానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణమైన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తన వద్ద తీసుకునే 50 వేల రూపాయలను తిరిగి చెల్లించమని ఒత్తిడి చేసినందుకు ఒక వ్యక్తి మహిళను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.

వివరాల్లోకి వెళితే…బెంగళూరులోని వినాయక నగర్‌లో నివాసముంటున్న యశోదమ్మ అనే మహిళ వద్ద జై కిషన్ అనే వ్యక్తి 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. జై కిషన్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. అయితే స్టాక్ మార్కెట్లో లాస్ రావడంతో అతను ఇన్వెస్ట్ చేసిన మొత్తం పోయింది. దీంతో అతడు చేసిన అప్పులు తీర్చడానికి మరికొన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో యశోదమ్మ అనే మహిళ వద్ద కూడా జై కిషన్ 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తీసుకొని చాలా కాలం గడవటంతో యశోదమ్మ తన అప్పు తీర్చమని జై కిషన్ మీద ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో ఇటీవల డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో జై కిషన్ ఆవేశంలో యశోదమ్మని కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత తానే జులై 9 వ తేదీ రాత్రి 9:30 సమయంలో యశోదమ్మ కుమారుడికి ఫోన్ చేసి తన తల్లి మరణించిందని సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న యశోదమ్మ కుమారుడు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే యశోదమ్మ ఒంటిమీద నగలు లేకపోవడంతో డబ్బు కోసమే హత్య చేసి ఉంటారని అనుమానం వచ్చిన యశోదమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఎంతోమందిని అనుమానించిన పోలీసులు తమకి సమాచారం ఇచ్చిన జై కిషన్ ని మాత్రం అనుమానించలేదు.

పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సమయంలో జై కిషన్ కొందరి వద్ద తీసుకున్న నాలుగు లక్షల అప్పును చెల్లించినట్లు సమాచారం అందుకున్నారు. దీంతో పోలీసులు జై కిషన్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా యశోదమ్మను తానే హత్య చేసినట్లు జై కిషన్ అంగీకరించాడు. 50వేల రూపాయలు అప్పు చెల్లించమని ఒత్తిడి చేయడంతో ఆమెను కత్తితో 91సార్లు పొడిచి హత్య చేశానని జై కిషన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.