సమాజంలో నూతన పద్దతులు ఎన్ని వస్తున్నా మనుషుల మనస్సులో, ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. చెప్పినట్టు వినలేదని గర్భవతి అయిన భార్యను, పిల్లలను తల్లిదండ్రులతో కలిసి అతి కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు.
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామానికి చెందిన శివరామయ్యకు బేతంచర్ల గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మకు 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వెంకటలక్ష్మమ్మ నాలుగు నెలల గర్భవతి. పెళ్లయిన మూడు సంవత్సరాల నుంచే భర్త, అత్తమామ వెంకటలక్ష్మమ్మను ఏదో కారణంతో వేధించేవారు. అదనపు కట్నం తేవాలని కొట్టేవారు.
ప్రస్తుతం వెంకట లక్ష్మమ్మ గర్భవతి కావడంతో అబార్షన్ చేయించుకోవాలని వేధించారు. దీనికి వెంకటలక్ష్మమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా ఆమె పీడ విరగడం చేసుకోవాలని తల్లి దండ్రులతో కలిసి పథకం పన్నాడు. గురువారం తెల్లవారు జామున అంతా నిద్రలో ఉండగా వెంకటలక్ష్మమ్మ, పిల్లల పై భర్త, అత్తమామలు డీజిల్ పోసి నిప్పంటించారు. వారు బయటికి రాకుండా బయట తలుపులు పెట్టారు. మంటల్లో కాలిపోయి వారు ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పెళ్లి అయినప్పటి నుంచి కూడా నిత్యం వేధించేవారని అసలు వారికి వెంకటలక్ష్మమ్మ అంటే ిఇష్టం లేదని స్థానికులు అంటున్నారు. అమాయకుల ప్రాణాలు తీయడానికి అసలు వారికి మనసెలా వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్దుగా ఉన్న పిల్లలు మాంసపు ముద్దలలా తయారు కావడంతో వారు కన్నీరు పెట్టారు. కిరాతకంగా భార్య పిల్లలను చంపిన భర్త, అత్తమామలను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. వెంకట లక్ష్మమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.