మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం అన్యోన్యంగానే ఉన్నారు. భార్య నాలుగు నెలల గర్భవతి. మద్యానికి అలవాటుపడ్డ భర్త నిత్యం ఆమెను తాగొచ్చి వేధించేవాడు. అయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం అన్ని భరించింది. కానీ ఆ భర్తలో రాక్షసత్వం బయటపడింది. తాగిన మత్తులో భార్య గర్భిని అని కూడా చూడకుండా చంపేశాడు.

ఈస్ట్ మారేడుపల్లి వాల్మీకి నగర్ కు చెందిన సన్ని బిడ్లాన్ అదే కాలనీకి చెందిన సత్యవతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరైనా పెద్దలను ఎదురించి 2013 ఫిబ్రవరి 28న దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి తర్వాత పెద్దలు కూడా వారిని స్వాగతించారు. దంపతులిద్దరు అదే కాలనీలో రూం తీసుకొని కాపురం పెట్టారు. సన్నీ కిరాణం దుకాణంలో పని చేస్తున్నాడు. సత్యవతి ఇండ్లలో పని చేసేది. కొంత కాలంగా మద్యానికి బానిసైన సన్ని భార్యను నిత్యం డబ్బుల కోసం వేధించేవాడు. ప్రస్తుతం సత్యవతి నాలుగు నెలల గర్భవతి.

ఆదివారం రాత్రి బాగ తాగొచ్చిన సన్ని సత్యవతితో గొడవపడ్డాడు. రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ తాగేందుకు వెళ్లి 11గంటలకు వచ్చాడు. మళ్లీ సత్యవతితో గొడవపడి మద్యం మత్తులో ఆమె గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఇంట్లోనే పడుకున్నాడు. తెల్లారి సత్యవతి మీద ఉన్న నగలన్నీ తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఆ రోజంతా తాగి రాత్రి వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి కోడలిని చంపేశానని అన్నాడు. దీంతో కంగారు పడిన సన్ని తండ్రి సత్యవతి తండ్రికి సమాచారం ఇచ్చి ఇద్దరు ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా సత్యవతి కన్పించింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.