స్వాతంత్ర దినోత్సవం నాడు అంగన్వాడి కార్యకర్తను హత్య చేసిన భర్త!

ఆగస్టు 15వ తేదీన సోమవారం 75 వ స్వాతంత్ర వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీ సోమవారం ఒక అంగన్వాడీ కార్యకర్తను తన భర్త దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అందరు ముందు కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే…కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం ప్రవీణ్, శిరీష దంపతులకు 10 సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది. వీరికి శరణ్య, శశివర్ధన్ అనే ఇద్దరు పిల్లలు. ప్రవీణ్ ప్లంబర్ గా పని చేయగా.. శిరీష అంగన్వాడి సెంటర్ లో ఆయాగా పని చేస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వల్ల తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో శిరీష తన భర్త నుండి దూరంగా ఉంటూ అతని మీద కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల శిరీష అడ్వొకేట్​ ద్వారా ప్రవీణ్ కి లీగల్​నోటీసులు పంపించింది.

దీంతో ప్రవీణ్ అవమానంగా భావించాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం శిరీష ఇందుర్తి అంగన్​వాడీ సెంటర్​కు వచ్చి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అక్కడికి వచ్చిన పిల్లలతో పాటు గెస్టులకు చాక్లెట్లు, ప్రసాదం సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో ప్రవీణ్​ అంగన్వాడి సెంటర్​లోకి వచ్చి అందరూ చూస్తుండగానే శిరీషను బలవంతంగా బయటికి లాక్కెళ్లి ముక్కు మూసి మెడ పట్టుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి అక్కడినుండి పారిపోయాడు. గొంతు కోయటంతో శిరీష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శిరీషను హత్య చేసిన తర్వాత ప్రవీణ్ చిగురుమామిడి పీఎస్​లో లొంగిపోయాడు.