వేధించాడంటూ లెక్చ‌ర‌ర్‌పై దాడి, అమ్మాయి ప్లాన్ తెలిసి షాక్

ఒక కళాశాలలో సోమవారం జరిగిన హైడ్రామా మామూలుగా లేదు. అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం కౌలేపల్లి లోని ఒక కళాశాలలో జరిగిన ఘటన అందరిని నివ్వెరపోయేలా చేసింది. లెక్చరరు విద్యార్థినిలను వేధిస్తున్నాడంటూ వచ్చే వార్తలు వింటూనే ఉంటున్నాం. కానీ ఒక లెక్చరర్ అలాంటి పని చేయకుండానే దెబ్బలు తిన్నాడు. ఒక అమ్మాయి చెప్పిన సినిమాటిక్ స్టోరీ అతడిని ఈ పరిస్థితికి తెచ్చింది. విచారణ జరిపిన పోలీసులు కూడా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో పూర్తిగా కింద ఉంది చదవండి.

కదిరి మండలం కౌలేపల్లి లో జూనియర్ కాలేజీలోని బోటనీ లెక్చరర్ రమేష్ నాయక్ ను ఒకమ్మాయి తల్లిదండ్రులు చితకబాదారు. తమ కూతురిని వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తూ అతనిపై దాడికి దిగారు. “గత గురువారం కాలేజీకి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న తమ కుమార్తెను సదరు లెక్చరర్ తన కార్ లో ఎక్కించుకుని, అనంతపురం రోడ్డువైపుకు తీసుకెళ్లాడు. అమ్మాయి కాళ్ళు, చేతులు కట్టేసి బ్రిడ్జి కింద వదిలి వెళ్ళాడు. మా అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని రాత్రికి ఇంటికి చేరుకుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు లెక్చరర్ పై ఆరోపణలు చేశారు”.

తల్లిదండ్రులతో పాటు కాలేజీకి వచ్చిన ఆ అమ్మాయి మీడియా ముందు ఇదే స్టోరీ చెప్పింది. అయితే వీరితోపాటు కళాశాలకు వచ్చిన మరికొందరు కాలేజీలో వీరంగం సృష్టించటంతో అక్కడి వాతావరణం ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న కదిరి రూరల్ ఎస్సై వెంకటస్వామి ఘటనాస్థలికి చేరుకున్నారు. బోటనీ లెక్చరర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆ అమ్మాయిని, తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యాన్ని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.

ముందుగా విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించారు పోలీసులు. వారంతా ఒకేలా సమాధానం చెప్పారు పోలీసులకు. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవి తప్పుడు ఆరోపణలని పోలీసులు తేల్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజిలోనే ఉన్నాడు. ఆ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. మరి ఆ అమ్మాయి ఎందుకు లెక్చరరు మీద అంత పెద్ద అబాండం వేసి ఇంత రచ్చ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.

లెక్చరర్ మీద ఆరోపణలు చేసిన ఆ స్టూడెంట్ గురువారం అసలు కాలేజీకి వెళ్ళలేదు. మీ అమ్మాయి కాలేజీకి రాలేదంటూ కాలేజీ యాజమాన్యం ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం వారు పోలీసులకు వివరించారు. ఆ విద్యార్థిని చేసిన ఆరోపణలు అబద్దమని తేలడంతో ఆమె తల్లిదండ్రులు మిగిలినవారు షాక్ తిన్నారు. ఆ అమ్మాయి అబద్దం ఎందుకు చెప్పింది, ఆరోజు ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ అమ్మాయి చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఎందుకు ఈ విధంగా ఫిర్యాదు చేసిందో విచారణ చేపడతామని కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ మీడియాతో తెలిపారు.

(ఫోటో ఏబీఎన్ వారి సౌజన్యంతో)