ఏపి లో బిజెపి ఒంటరి పోరు, కడప ఉక్కుకు శంకుస్థాపన

(యనమల నాగిరెడ్డి)


రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్, మే నెలలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బి.జె.పి. ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతుందని, అందుకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేయాలని బి.జె.పి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.

పోలింగ్ బూతు స్థాయిలో కమిటీ లను వేసి బలోపేతం చేయాలని, ఐదు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రాన్ని నిర్మించాలని, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన కడప జిల్లా కార్యకర్తల కు సూచించారు.

సి.యం. రమేష్ ఉక్కు దీక్షపై మండిపడిన కన్నా

ఇటీవల కడపలో పర్యటించిన కన్నా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ సబ్యడు సి.యం.రమేష్ చేసిన “దొంగ ఉక్కు దీక్షపై” పార్టీ నాయకులు సరిగా స్పందించలేదని మండిపడ్డారట. “చెక్కర వ్యాధిగ్రస్తుడుగా ఉన్న రమేష్” అన్ని రోజుల పాటు ఎలా “నిరాహార దీక్ష” చేశారో, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా దుర్వినియోగం చేశారో, ఆర్టీసి బస్సులకు డబ్బులు చెల్లించకుండా ఎలా వాడుకున్నారో తెలిసినా, ఈ దీక్ష బి.జె.పి.ని దెబ్బ తీయడానికే నని తెలిసినా పార్టీ నాయకులు మౌనం గా ఉన్నారని కన్నా ఆవేదన వ్యక్తంచేశారు.

 
వైద్య నివేదికల ఆధారంగా రమేష్ దొంగ దీక్షను, టీడీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో పార్టీ శ్రేణులు సకాలంలో, సక్రమంగా స్పందించక పోవడంపై ఆయన కార్యకర్త ఆగ్రహించారని సమాచారం.

కడప ఉక్కుకు త్వరలో శంఖుస్థాపన

కడప ఉక్కు ఫ్యాక్టరీకి త్వరలో శంఖు స్థాపన చేస్తామని, ఇప్పటి వరకూ చేయలేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. 
ఎన్నికలలోపు ఉక్కు ఫ్యాక్టరీపై విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించడంతో పాటు శంఖుస్థాపన కూడా జరిపిస్తామని కన్నా ధీమాగా చెపారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కడప పార్లమెంటు సీటుకు కందుల!

వచ్చే ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానానికి పోటి చేయడానికి కందుల రాజమోహన్ రెడ్డి సిద్ధపడగా, మరికొంతమంది ఉత్సాహవంతులు
ప్రోద్దటూరు, కడప, రాజంపేట స్థానాలనుంచి పోటీ కి సిద్ధపడ్డారని సమాచారం.
అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధమౌతున్నాయని, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కడప జిల్లాలో కార్యకర్తలు, నాయకులు మరింత సమర్థవంతంగా పని చేయాలని, వారికి అన్ని విధాలా సహకరిస్తామని కన్నా వారు హామీ ఇచ్చారని ఆ వర్గాలు వివరించాయి.