అయోధ్యలో దారుణం.. దళిత అక్కా చెల్లెళ్ళ పై సామూహిక హత్యాచారం?

దేశంలో రోజురోజుకీ మహిళలకు రక్షణ కరువైంది. మహిళల మీద హత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారి మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ వారిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కామ వాంఛలు తీర్చుకోవటానికి కొంతమంది పురుషులు మృగాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. మహిళలు కనిపించగానే చిన్నపిల్లలు, ముసలి వారు అని చూడకుండా వారి మీద హత్యచారాలు చేస్తున్నారు. ఇలా రోజూ ఎంతో మంది మహిళలు, పిల్లలు ఇలాంటి నీచులు చేతిలో బలైపోతున్నారు. ఇటీవల అయోధ్యలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం…. అయోధ్యలో దళిత అక్కా చెల్లెళ్ళ మీద సామూహిక హత్యాచారం జరిగింది. ఈ దారుణ సంఘటన అయోధ్యలోని బికాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్ళు పని నిమిత్తం వారి గ్రామానికి సమీపంలో ఉన్న షెర్పూర్‌పురా మార్కెట్‌ కి వచ్చారు. పని ముగించుకున్న తర్వాత మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో కొందరు దుండగులు వారిని అపహరించి దగ్గరలోని చెరుకు పొలాల్లోకి తీసుకెల్లారు. తర్వాత వారి మీద సామూహికంగా లైంగిక దాడి చేశారు. కొంత సమయం తర్వాత ఆ దుర్మార్గులు వారిని విడిచి పెట్టారు.

దీంతో బాధితులిద్దరు ఇంటికి చేరుకొని జరిగిన ఘటన గురించి వారి కుటుంబ సభ్యులతో వివరించారు. దీంతో బాధితురాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకుండా నిందితులను కాపాడటానికి బాధితులకు నచ్చి చెప్పి పంపించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఘటన గురించి సీనియర్ పోలీసు అధికారులకు సమాచారం అందడంతో వారు జోక్యం చేసుకున్నారు. అందువల్ల స్థానిక పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన భాయిలాల్‌ యాదవ్‌, త్రిభువన్‌ యాదవ్‌ తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.