మేడ్చల్ జిల్లాలో దారుణం.. కూతురి భర్త మీద దాడి చేసి దారుణ హత్య..?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు పెద్దలను ఎదిరించి వివాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కానీ పెంచి ఆడపిల్లలను ప్రయోజకులు చేసిన తల్లిదండ్రులు అవమానాలు భరించాల్సి వస్తోంది. అయితే ఈ అవమాన భారం వల్ల కొంతమంది తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో పరువు హత్యలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. తల్లితండ్రులను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న కూతురు. కూతురి కళ్ళ ఎదుట ఆమె ప్రేమించిన వాడిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…దూలపల్లిలోని సూరారం కాలనీలో హరీశ్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి గత ఆరు నెలలుగా నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో ఎర్రగడ్డలో నివాసం ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు యువకుడిని హెచ్చరించారు. దీంతో అతడు దూలపల్లికి మకాం మార్చాడు. అక్కడ ఓ అందమైన ఇంటిని నిర్మించుకుని గతంలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుని హాయిగా జీవిస్తున్నాడు.దీంతో హరీశ్​పై పగ పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిని ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశారు.

ఈ క్రమంలో వారి కదలికలపై నిఘా పెట్టి రెండు రోజుల క్రితం దూలపల్లి వద్ద అమ్మాయి చూస్తుండగానే హరీశ్​ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం అమ్మాయిని తమతో పాటు తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు​మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే హరీశ్‌ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. హరీష్ హత్యకు కారణమైన యువతి కుటుంబ సభ్యులను దారుణంగా శిక్షించాలని హరీష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.