సమంత ఆరోగ్యంపై రోజుకో వార్త వైరల్‌!?

సోషల్ మీడియా అంటే మంచీ – చెడులన్నింటినీ కలగాపులగం చేయడం కాదు.. మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ పోస్ట్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించడం మంచిది. మరి ఇప్పుడు అలా జరుగుతుందంటారా? ప్చ్..! లేదు..లేదు.. ఎక్కడా అలా జరగడం లేదు. సరే.. ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం.. ఈ మధ్య టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత గురించి.. ఆమె ఆరోగ్యం గురించి సినిమా ప్రియులు.. ఆమె అభిమానులు ఆరా తీస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆయా పోస్టుల్లో కొన్ని ఆలోచించే విధంగానే ఉంటున్నాయి…

మరికొన్ని ఇవేం పోస్టులు.. ఇవేం ప్రశ్నలు బాబోయ్.. అనిపిస్తూ చికాకు తెప్పిస్తున్నాయి. నటి సమంత గతకొంతకాలంగా మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ట్రీట్‌మెంట్‌ కోసం దక్షిణ కొరియాకు కూడా వెళుతున్నట్టు తెలిసింది. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంది. త్వరలోనే తాను ఈ ఆటో ఇమ్యూన్‌ రుగ్మత నుంచి బయటపడతానని ధీమా కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యంపై రోజుకో వార్త బాగా వైరల్‌ అవుతూనే ఉంది.

సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ‘యశోద’ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. హరి-హరిశ్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సమంత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే.. సమంత అనారోగ్యం కారణంగా చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం వాయిదా పడింది. దీనిపై కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా సమంత ఆరోగ్యం మరోసారి క్షీణించిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్‌ వస్తున్నాయి. అంతేకాదు చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తున్నారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలపై నటి సమంత టీం తాజాగా స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టి పారేసింది. సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని వేడుకుంటోంది!