డబ్బుల కోసం దారుణం.. అనాధ వ్యక్తికి బీమా చేయించి మరి హత్య..!

ప్రస్తుత కాలంలో సులభంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది దొంగతనాలకు పాల్పడుతుంటే మరి కొంతమంది ఇతరులను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం డబ్బుల కోసం ఏకంగా ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఎటువంటి దారుణ సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. సులభంగా డబ్బులు సంపాదించడానికి అనాధ వ్యక్తికి భీమా చేయించి మరి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతండాకు చెందిన బోడ శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద మేడిపల్లికి చెందిన భిక్షపతి (34) అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తున్నాడు. భిక్షపతిపై అనాధ కావటంతో శ్రీకాంత్ ఓ బ్యాంకులో అతని పేరు పై రూ.50 లక్షలకు బీమా చేయించి నామినిగా తన పేరును నమోదు చేయించుకున్నాడు.ఆ తర్వాత అదే బ్యాంకులో అతని పేరుపై రూ.52 లక్షలు రుణం తీసుకుని ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. కొంతకాలానికి ఎలాగైనా ఆ బీమా డబ్బులు పొందాలని ఆశతో మల్కాజిగిరి పోలీస్ స్టేషనులో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసే మోతీలాల్‌తో పాటు తన వద్ద పని చేసే సతీష్, సమ్మన్నలకు డబ్బు ఆశ చూపి బిక్షపతిని చంపటానికి ప్లాన్ చేశారు.

వారి ప్లాన్ ప్రకారం గత 2021 డిసెంబరు నెలలో భిక్షపతికి మద్యం తాగించి కారులో ఎక్కించుకుని షాద్ నగర్ శివారు ప్రాంతమైన మొగలిగిద్దవైపు వెళ్లారు. అక్కడ అతనిని హాకీ కర్రతో కొట్టి హత్య చేసే ఆ తర్వాత రోడ్డు మీద పడేసి రెండు సార్లు కారుని అతని మీద పోనిచ్చి ప్రమాదంగా సృష్టించారు. బిక్షపతి మరణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతడి శవాన్ని తీసుకొని పోస్టుమార్టం చేయించగా హత్యగా రిపోర్ట్ వచ్చింది. అయితే పోలీసులకు ఆనవాళ్లు దొరకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

కానీ శ్రీకాంత్ భీమా డబ్బుల కోసం ప్రయత్నం చేయటంతో బీమా సంస్థ నిర్వాహకులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులకు క్లూ లభించి శ్రీకాంత్ మీద అనుమానం పెరిగింది. అరమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న ఈ కేసును తిరిగి ప్రారంభించి లోతుగా విచారించగా బీమా డబ్బుకోసం ప్రయత్నిస్తున్న శ్రీకాంత్‌కు, బిక్షపతి కి ఎలాంటి రక్త సంబంధం లేకపోవడంతో పోలీసులకు వారి అనుమానం రెట్టింపు అయింది. దీంతో పోలీసులు రంగంలోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో సోమవారం నిందితులందరినీ అరెస్టు కోర్టులో హాజరుపరిచారు.