ఎన్టీఆర్ తనయుడు సిని నటుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో జరిగే వివాహ వేడుకకు హైదరాబాద్ నుంచి వెళుతుండగా నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు బోల్తా పడటంతో హరికృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. నార్కట్ పల్లి కామినేని హస్పిటల్ లో హరికృష్ణ చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి.
ప్రమాద స్థలంలో నందమూరి హరికృష్ణ
2014 లో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు జానకీ రామ్ ఒక్కడే వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ అడ్డు రావడంతో కారు ప్రమాదానికి గురై జానకీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదానికి గురైన నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు
2009 లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోతె సమీపంలో ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఎన్టీఆర్ అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు.
ఆస్పత్రిలో నందమూరి మృతదేహం, విషాదంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
ఇప్పుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలోనే జరిగిన ప్రమాదంలో చనిపోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి. నందమూరి కుటుంబానికి జరిగిన ప్రమాదాలన్ని నల్లగొండ జిల్లాలోని హైవేలపైనే జరిగాయి. దీంతో నందమూరి కుటుంబాలకు యాక్సిడెంట్ ల గండం వెంటాడుతుందని అభిమానులు కలవరపడుతున్నారు. నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నెంబర్ ఏపీ 29 బీడబ్ల్యూ 2323. ఎన్టీఆర్, జానకీ రామ్ లకు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇదే కారు నంబర్. వారి లక్కీ నంబర్ ను కారు నెంబర్ గా తీసుకున్నారని తెలుస్తోంది. కానీ అదే నంబర్ వారికి విషాదాన్ని మిగులుస్తుందని పలువురు అభిమానులు అంటున్నారు. నందమూరి హరికృష్ణ మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.