టాక్స్ బాధితుల‌కు గుడ్ న్యూస్ -నిర్మ‌లా సీతారామ‌న్‌

భార‌త‌దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ చాలా ఇబ్బందుల్లో ఉంద‌న్న విష‌యం తెలిసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఒక తీపి క‌బురు చెప్ప‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇన్‌క‌మ్ ట్యాక్స్ ధ‌ర‌లు త‌గ్గించే ఆలోచన‌లో ఉంద‌ని తెలిపారు. దీంతో వచ్చే బడ్జెట్‌లో ఈ మేరకు పన్ను తగ్గింపు నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే క‌నుక జరిగితే ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే నెల‌వారి జీతం పెరగనుంది.

ఉద్యోగాల డిమాండ్ త‌గ్గిపోయింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. కార్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. జీడీపీ కూడా పడకేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ‌ వినియోగాన్ని ఎలాగైనా పెరిగేలా చేయాలని మోదీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అవ‌స‌రాన్ని, వినియోగాన్ని పెంచేలా చేయ‌డానికి కావ‌ల‌సిన అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తూ వివిధ రకాల అంశాలపై చర్చిస్తున్నాం అన్నారు. ఇందులో పర్సనల్ ట్యాక్స్ రేట్లు కూడా ఒక భాగం’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. హెచ్‌టీ లీడర్‌షిప్ సమిట్ 2019లో ఆమె ఈ విధంగా మాట్లాడారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఉప‌శ‌మ‌నాన్ని కలిగిస్తారనే ప్రశ్నకు సమాధానంగా బడ్జెట్ వరకు వేచి చూడండి అంటూ సమాధానమిచ్చారు నిర్మలా సీతారామన్. ఇకపోతే 2021 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఒక వేళ ఇదే క‌నుక జ‌రిగితే కేంద్ర ప్రభుత్వం పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ధ‌ర‌ను తగ్గిస్తే.. అప్పుడు ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారకుండా ఉంటాయి. డిమాండ్, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లు పుంజుకునే అవకాశముంది. ఈ నెల ఆరంభంలో కూడా నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

అంతే కాక ఆదాయపు పన్ను రేటు తగ్గింపునకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కూడా తెలిపారు. కార్పొరేట్ ట్యాక్స్‌ని ఆదాయపు పన్నుతో పోల్చి చూడటం సరికాదని పేర్కొన్నారు. కాగా పన్ను సంబంధిత అంశం ఏదైనా తెలియాలంటే బడ్జెట్ వరకు ఆగాల్సిందేనన్నారు. ఇక మ‌రి చూద్దాం ఏ మేర‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం సామాన్యుడి పై ప‌న్నుఒత్తిడిని త‌గ్గిస్తుందో.