ట్రైలర్ ద్వారానే అంచనాలు పెంచిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫేం విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కొందరైతే ఏకంగా ‘అర్జున్ రెడ్డి’ స్థాయి చిత్రం అవుతుందని అన్నారు. అయితే ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి అందుతున్న టాక్ ప్రకారం..అంచనాలను అసలు అందుకోలేక పోయిందీ చిత్రం. బోర్ దాస్ అని డైరక్టర్ గా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఇక కథేంటంటే… హైదరాబాద్ ఫలక్‌నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్ సేన్) అదే ఏరియాలోని శంకరన్న అనే గ్యాంగ్ స్టర్ ని చూసి స్ఫూర్తి పొందుతాడు. అతడిలా ఎదగాలని కలలు కంటాడు. దాంతో…. తనకంటూ ఓ గ్యాంగ్ ని తయారు చేస్తాడు. గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా దొరుకుతుంది. తను అనుకున్న జీవితం హ్యాపీగా గడిపిస్తూండగా శంకర్ హత్యకు గురవుతాడు. దాంతో హ్యాపీగా బతికిన ఈ గ్యాంగ్‌కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి ఒక బిజినెస్ చేద్దామని ఫలక్‌నుమా ఏరియాలో మటన్ షాప్ ప్రారంభిస్తారు.
అప్పటికే మటన్ బిజినెస్ లో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ బిజినెస్ స్టార్ చేశాక వారి బిజినెస్ స్లో అవుతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ మర్డర్ కు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ ఏం చేస్తారు..అతని లవ్ లైఫ్ ఏమైందనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది.
సినిమా కు వచ్చిన హైప్ కు , సినిమాకు సంభంధం లేకుండా పోయింది. మలయాళ సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం …హైదరాబాద్ నేటివిటిని కొంతవరకూ తేగలిగింది కానీ స్క్రీన్ ప్లే పరంగా బోర్ కొట్టించింది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా..సెకండాఫ్ విసిగించింది. ఎంతసేపూ తాగటం, తిట్టుకోవటమే కథ అన్నట్లు సాగటం ఆడియన్స్ కు వెగటు కలిగించింది.