ప్రీరిలీజ్ బిజినెస్‌లో `సైరా:న‌ర‌సింహారెడ్డి` హ‌వా

చిరు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..

`బాహ‌బలి` ఫ్రాంఛైజీ ఘ‌న‌విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. క‌థ‌లు కంటెంట్ లో మార్పొచ్చింది. బిజినెస్‌, మేకింగ్‌, బ‌డ్జెట్ స్థాయి కూడా పెరిగింది. ఒక‌ప్పుడు భారీ ఖ‌ర్చుతో సినిమా చేయాలంటే హీరో, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు జంకేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ప్ర‌పంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఏ సినిమా మొద‌లైనా అంత‌టా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. `సాహో` త‌రువాత ఇప్పుడు అంద‌రి దృష్టి `సైరా`పై ప‌డింది. దీంతో భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దానికి త‌గ్గ‌ట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది.

మూడు ద‌శాబ్దాల పాటు తిరుగులేని మెగాస్టార్‌గా ఓ వెలుగు వెళుగుతున్న చిరంజివి న‌టించి ఈ చిత్రాన్ని తెలుగు నాట భారీ స్థాయిలోనే అమ్మేశారు. 60 నుంచి 65 కోట్ల రేషియోలో అమ్మిన‌ట్లు తెలుస్తోంది. అమ్మిన ప్ర‌తీ ఏరియా ఎన్ఆర్ ఐ విధానంతో పాటు ప‌ది శాతం రిట‌ర్న‌బుల్ అడ్వాన్స్ లెక్క‌న అమ్మేశారు. ఆంధ్రా ఏరియా నుంచి ఇప్ప‌టికే 65 కోట్లు ప‌లికింది. సీడెడ్‌లో 20, నైజామ్‌లో 30కి అమ్మేశారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 115 కోట్లకు `సైరా`ని అమ్మేశారు. ఇక ఓవ‌ర్సీస్ 15 కోట్లు, క‌ర్ణాట‌క 27 కోట్లకు అమ్మేయ‌గా త‌మిళ‌నాడు 10, కేర‌ళ 6 కోట్ల‌కు అమ్ముడుపోయింది. బాలీవుడ్‌లో హిందీ వెర్ష‌న్‌ని ద‌ర్శ‌కుడు, న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ రిలీజ్ చేస్తున్నాడు. ఎంత‌కు వీరి మ‌ధ్య డీల్ కుదిరింద‌న్న‌ది మాత్రం ఇంకా బ‌య‌టికి రాలేదు.

బాలీవుడ్ రైట్స్‌ని మిన‌హాయిస్తే `సైరా` ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్ప‌టి వ‌ర‌కు 173 కోట్ల‌కు చేరింది. డిజిట‌ల్ రైట్స్ ద్వారా అమెజాన్ నుంచి అన్ని భాష‌ల్లో క‌లిపి 50 కోట్లు ద‌క్కింద‌ని తెలిసింది. శాటిలైట్ రైట్స్ ద్వారా రామ్‌చ‌ర‌ణ్ 100 కోట్లు ఆశిస్తున్నాడ‌ట‌. మ‌రి అంత పెద్ద‌ మొత్తం వ‌స్తుందా? అంటే అమితాబ్ తో పాటే మిగ‌తా భాష‌ల న‌టులు వున్నారు కాబ‌ట్టి క‌చ్చితంగా వ‌స్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ మొత్తం రాబ‌ట్ట‌గ‌లిగితే నాన్ థియేట‌ర్ రైట్స్ రూపంలో `సైరా` మూడు వంద‌ల కోట్లు రాబ‌ట్టిన‌ట్ట‌వుతుంది. `సైరా`కు ఇది పెద్ద ఎస్సెట్ అన్న‌ట్టే.