పెద్ద సినిమాలు రిలీజ్ అంటే లెక్కలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. ప్రమోషన్, నెంబరాఫ్ థియోటర్స్ దొరకటం వంటి విషయాలు పరిగణనలోకి తీసుకుని రిలీజ్ పెట్టుకుంటారు. పండగ రోజుల్లో ఓ పెద్ద సినిమా రిలీజ్ చేయాలంటే భారీ ఎత్తున పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి రోజున రిలీజ్ అంటే ఇక చెప్పక్కర్లేదు. ఫుల్ కాంపిటేషన్. తమిళ,తెలుగులలో ఇదే పరిస్దితి. దాంతో కొన్ని సినిమాలు రిలీజ్ కు వెనక్కి పెట్టుకోక తప్పదు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాకూ అదే పరిస్దితి ఎదురుకానుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకి కేవలం తమిళంలోనే కాదు..తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. రీసెంట్ గా రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొంది రిలీజైన 2.0. చిత్రం సైతం తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజై మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సెట్ పై ఉండగానే రజనీ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే.
వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పేట్ట సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్‌డేట్ పై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తమిళ నిర్మాతలు ప్రకటించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంతవరకు తెలుగు వర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభించలేదు. దీంతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ పేట్ట రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది.
ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. అదే సంక్రాంతికి తెలుగులో యన్.టి.ఆర్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు పోటి పడుతున్నాయి. దీంతో పేట్ట ను తెలుగు వెర్షన్ రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రజనీ సరసన త్రిష, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.