అమెరికాలో ‘జెర్సీ’కలెక్షన్స్ అదుర్స్ !

నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా యూఎస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

‘జెర్సీ’ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా అక్కడ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకున్న నాని ఆరో సినిమా ఇదని తెలిపారు.

ఈ నెల 19న విడుదలైన చిత్రం అమెరికా ప్రీమియర్‌లో 144,687 డాలర్లు, తొలి రోజున 262,732 డాలర్లు, రెండో రోజున 325,923 డాలర్లు, మూడో రోజున 179,391 డాలర్లు, నాలుగో రోజున 43,381 డాలర్లు, ఐదో రోజున 43,220 డాలర్లు మొత్తం 1,000,025 డాలర్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

‘జెర్సీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ బాణీలు అందించారు. ఇందులో నాని ‘అర్జున్‌’ అనే క్రికెటర్‌గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు.