‘డియర్ కామ్రేడ్’కు భారీ నష్టాలే!
భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఒకేసారి నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదలైన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి కి డివైడ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో నిర్మాతలు గట్టెక్కేస్తారు, ఫస్ట్ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని అందరూ అంచనా వేసారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్ లో ఫర్వాలేదనిపించిన డియర్ కామ్రేడ్ వసూళ్లు ఇప్పుడు వీక్ డేస్ లో వీకైపోయాయి. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అప్పటికీ యూనిట్ సినిమాని లెంగ్త్ తగ్గించి, రీ ఎడిట్ చేసినా వర్క్ అవుట్ కాలేదు.
మొదటి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించిన కామ్రేడ్, వీక్ డేస్‌లో డీలా పడిపోయాడు. తొలివారం ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఇక కామ్రేడ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించటం లేదు.
డియర్ కామ్రేడ్ దాదాపు 34 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు ట్రేడ్ లో. దీన్ని బట్టి…దాదాపు అన్ని ఏరియాల్లో కామ్రేడ్ నష్టాలనే మిగల్చనున్నాడన్న మాట.