బాలీవుడ్ నటుడు సోనుసూద్ తెలుగులోనూ బాగా ఫేమస్ అయిన నటుడు. విలన్ పాత్రలతో ఇక్కడా బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల్ని సొంత డబ్బు ఖర్చు చేసి బస్సులేసి స్వరాష్ర్టాలకు తరలించాడు. ప్రభుత్వాలే చేయలేని పనిని సోనుసూద్ చేసి చూపించాడు. అటుపై చిత్తూరు జిల్లా వాసి కష్టాలు చూసి ఓ ట్రాక్టర్ కొనిచ్చాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలంతా సోనుసూద్ ని ఆకాశానికి ఎత్తేసారు. సోమురెడ్డి అయితే సోనుసూద్ ని విలన్ లా చూడలేకపోతున్నా..హీరోలాగే ఊహించుకుంటున్నానంటూ భారీ డైలాగులే కొట్టారు.
ఇంకా చంద్రబాబు సహా పలువురు నేతలు ప్రశంసించారు. ఇక సోనుసూద్ పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న వారికి 3 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తానని ప్రకటించారు. ఓ రాజకీయ నాయకుడు గానీ, స్టార్ హీరో గానీ, వ్యాపార వేత్త గానీ ఎవరూ చేయలేని కొన్ని అరుదైన పనులు చేసి సోనుసూద్ నిజంగా రియల్ హీరో అనిపించాడు. అందుకు ఆయన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. కానీ టాలీవుడ్ మాత్రం ఈ రియల్ హీరోని ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈ యన తలపెట్టిన వలస కార్మికుల తరలింపు దగ్గర నుంచి 3 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చినా కూడా ఒక్క టాలీవుడ్ హీరో కూడా స్పందించకపోవడం గమనార్హం.
రామ్ మాత్రం సేవల్ని కొనియాడుతూ ట్వీట్ చేసాడు తప్ప తక్కిన ఏ స్టార్ హీరో గానీ, నిర్మాతలు గానీ, డైరెక్టర్లు గానీ ఎవరూ స్పందించలేదు. మరి ఇలా ఎందుకు జరిగిందంటే? సరైన సమాధానం మాత్రం లేదు. మంచి కార్యక్రమాలు అందులోనూ సేవా కార్యక్రమాలు లాంటివి తలపెట్టినప్పుడు భేషజాలం లేకుండా స్పందించాలి. అక్కడ భాషతోగానీ, ప్రాంతంతోగానీ సంబంధం లేదు. ఆ స్పందన మరింత మందిలో స్ఫూర్తిని నింపేలా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే? ఇక్కడ ఒక్క స్టార్ హీరో కూడా సోనుసూద్ గురించి ట్వీట్ చేసింది లేదు. సోనుసూద్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు అభిమానులు మాత్రం ఆయన ఫోటోల్ని..వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.