బాలీవుడ్ సినిమాల్లో ఉండుండి మళ్ళీ పోలీసు హవా మొదలైంది. స్టార్స్ సూపర్ పోలీసులై ఫ్యాన్స్ కి పైసా వసూల్ ఫీలింగ్స్ ఇవ్వడానికి కండలు పొంగించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే పది స్టార్ పోలీసు సినిమాలు ప్రకటించారు. మరెన్నో నిర్మాణంలో వున్నాయి. ఏ సినిమాలు అంతరించిపోయినా పోలీసు సినిమాలు అంతరించిపోవు. ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా పోలీస్ సినిమా. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర్నుంచీ హిందీ స్మాల్ స్టార్ రణదీప్ హుడా వరకూ, కరీనా కపూర్ సహా పోలీస్ గెటప్స్ తో యాక్షన్లోకి దిగిపోతున్నారు. ఈ సంవత్సరం సిల్వర్ స్క్రీన్ల మీద పోలీసులే పోలీసులు. వాళ్ళ ఫైటింగులే ఫైటింగులు.
తలైవా రజనీ నటిస్తున్న ‘దర్బార్’ టాప్ ట్రెండింగ్ గా వుంది. ఏఆర్ ముగుగ దాస్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా ముంబాయిలో షూటింగు జరుపుకుంటోంది. రజనీ నటిస్తున్న 167వ సినిమా ఇది. పోలీసు పాత్ర నటించి పాతికేళ్ళయింది. ఇప్పుడు పోలీసుగా ఏం దర్బార్ పెట్టాడో నని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులు ఫలించాలంటే వచ్చే జనవరి దాకా ఆగాల్సిందే.
ఇక సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సీక్వెల్ దబాంగ్ 3’ తో మరోసారి పోలీసుగా వస్తున్నాడు. ఇన్స్ పెక్టర్ చుల్బుల్ పాండేగా రీ ఎంట్రీ. ఈసారి విలన్ కన్నడ సుదీప్. హీరోయిన్ అదే సోనాక్షీ సిన్హా. దర్శకత్వం ప్రభుదేవా. ఇంకా అక్షయ్ కుమార్ కూడా పోలీస్ యూనిఫాంలో రోహిత్ శెట్టి యాక్షన్ మూవీ ‘సూర్యవంశీ’ లో నటిస్తున్నాడు. పదేళ్ళ తర్వాత ఇందులో అక్షయ్ తో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్ శెట్టి ఏది పట్టుకున్నా భారీ సక్సెస్ అవుతూ వస్తున్నాయి.
ఇంకోవైపు కరీనా కపూర్ లేడీ కాప్ గా కామ్ గా నటించుకుపోతోంది. సినిమా టైటిల్ ‘అంగ్రేజీ మీడియం’. ఇర్ఫాన్ ఖాన్ హీరో. హోమీ అదజనియా దర్శకుడు. ఐతే నాన్ కమర్షియల్ గా ఈ దర్శకుడు తీసిన గత మూడు సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. తాజాగా ఇద్దరు స్టార్స్ తో ఈసారైనా మెయిన్ స్ట్రీంలోకి వచ్చి ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో లేదో చూడాలి.
2008 లో సంచలనం సృష్టించిన న్యూఢిల్లీ బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కథాంశంగా నిర్మిస్తున్న ‘బాట్లా హౌస్’ లో యాక్షన్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. నిఖిల్ అద్వానీ దర్శకుడు. నోరా ఫతేహీ హీరోయిన్, రవికిషన్ విలన్. ఎసిపి సంజీవ్ కుమార్ యాదవ్ నిజ పాత్ర పోషిస్తున్నాడు జాన్ అబ్రహాం. ఏర్ లిఫ్ట్, సత్యమేవ జయతే, లక్నో సెంట్రల్ వంటి విజయాలు సాధించిన దర్శకుడు నిఖిల్ అద్వానీ, వివాదాస్పద బాట్లా హౌస్ ఎన్కౌంటర్ ని ఎలా హేండిల్ చేస్తాడో చూడాలి.
ఇక రోమాంటిక్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా ‘ఆర్టికల్ 15’ అనే పోలీస్ యాక్షన్లో నటిస్తున్నాడు. అనుభవ్ సిన్హా దర్శకుడు. కానీ 18 ఏళ్లుగా అనుభవ్ సిన్హాకి ఏ మాత్రం సక్సెస్ గ్రాఫ్ లేదు. ఈ పోలీస్ యాక్షన్ ని ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తీస్తున్నాడు. ఇషా తల్వార్ హీరోయిన్. ఇకపోతే రణదీప్ హుడా ప్రాజెక్టుకి ఇంకా టైటిల్ పెట్టలేదు. దీని స్పెషాలిటీ ఏమిటంటే సంజయ్ లేలా భన్సాలీ నిర్మాత. చిన్న టౌన్లో జరిగే కథ.
ఇలా బాలీవుడ్ లో పోలీస్ సినిమాల సందడి మొదలైంది. ఈ సంవత్సరం ఇన్ని సూపర్ పోలీసు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
-సికిందర్