Salman Khan: స్టార్ హీరోను కాటేసిన పాము. ఆస్పత్రిలో నటుడు

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (సల్లు భాయ్) పాముకాటుకు గురయ్యారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని పన్వేల్ లో ఆయన తమ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగింది. వెంటనే సల్లు భాయ్ ని హాస్పిటల్ కు హుటా హుటిన తరలించారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటేయడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెబుతున్నారు. నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM హాస్పిటల్ లో ఆయన్ను జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ అనంతరం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సల్మాన్ ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే రేపు సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పాముకాటుకు గురికావడంతో అభిమానులు కాస్త ఆందోళనకి గురవుతున్నారు. సల్మాన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫామ్ హౌస్ కి వెళ్లిన సల్మాన్ ని పాము కాటేసింది.

ప్రమాదం తప్పింది కాబట్టి సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను సింపుల్ గా ఫామ్ హౌస్ లోనే తన ఫ్యామిలీతో జరుపుకోనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ‘అంతిమ్’ సినిమాలో సల్మాన్ కీలకపాత్రలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్ గా ఆయన పాత్ర అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ.. కథలో సత్తా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక బాక్సఫీసు దగ్గర బోల్తాపడింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్ జాన్’ సీక్వెల్ లో నటించబోతున్నారని సమాచారం. 2015లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుని అందుకే ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు. దీనికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించనున్నారు. రీసెంట్ గా ఆయన ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.