భర్తల వేధింపులు, వివాదాలు మహిళా సెలబ్రెటీల జీవితంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ ప్రక్క కెరీర్ లో నిలదొక్కుకోవటానికి రాత్రింబవళ్లూ కష్టపడటం, అదే సమయంలో సాంసారిక జీవితాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. అవే కొన్ని సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. హిందీ టీవి సీరియల్ ఆర్టిస్ట్ అర్జూ గోవిత్రికర్ పరిస్దితి కూడా అలాగే ఉంది.
నాగిన్ వంటి అనేక సూపర్ హిట్ టివి సీరియల్స్ లో నటించి అర్జూ బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాజాగా తన భర్తతో విభేధాలు వచ్చి ..అతనిపై కేసు పెట్టడానికి తన సోదరి అదితి గోవిత్రికర్ తో కలసి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ తన భర్తపై గృహహింస కేసు నమోదు చేసింది. అంతేకాదు భర్త సిద్దార్థ్ సబర్వాల్ తనని ఏ స్దాయిలో హింసించాడో చూపేందుకు అర్జూ సాక్ష్యాధారాలతో సహా ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఆ కంప్లైంట్ లో తన భర్త సిద్ధార్థ్ గత ఎనిమిదేళ్లుగా తాగి వచ్చి తనని హింసకు గురి చేస్తున్నట్లు ఆరోపించింది. ఐదేళ్ల నుంచి భర్తకు దూరంగా వర్లీలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు తెలిపింది. కానీ సిద్దార్థ్ తరచుగా వస్తూ తన కుమారుడిని తీసుకెళ్ళిపోతున్నాడని, ఈ క్రమంలో శారీరక దాడికి పాల్పడుతున్నట్లు అర్జూ పేర్కొంది. అలా తనకు కొట్టి తీసుకు వెళ్లిన సందర్భంలో తన భర్త తనపై దాడి చేసిన వీడియోని కూడా అర్జూ పోలీసులకు ఇచ్చింది.
ఆ వీడియోలో అర్జూని ఆమె భర్త చెంపదెబ్బ కొట్టి బాత్రూంలోకి ఈడ్చుకెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. వీటిని పోలీసులు చూసినట్లు మీడియాకు వివరించారు. ఈ సంఘటన ఫిబ్రవరి 15న జరిగినట్లు అర్జూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో సిద్దార్థ్ మద్యం సేవించి ఉన్నాడని పేర్కొంది.
ఈ ఘటనపై సిద్ధార్థ్ మీడియా వర్గాల ద్వారా స్పందిస్తూ.. తన భార్యే కొట్టమందని వెల్లడించారు. ‘సరైన సమయం వచ్చినప్పుడు నేను దీనిపై క్లారిటీ ఇస్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆర్జూను నేను కావాలని కొట్టలేదు. ఆమె ఓ క్రైమ్ థ్రిల్లర్‌కు సంబంధించిన షోలో పాల్గొంటోంది. ఈ షోకు రిహార్సల్స్ చేయాలని నాతో చెప్పింది. ఈ నేపథ్యంలో తనే నన్ను కొట్టమంది’ అని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాగ్‌బన్’ చిత్రంలో ఆర్జూ కీలక పాత్రను పోషించారు. ఆమె పాత్రకు గానూ మంచి మార్కులు పడ్డాయి. ఆర్జూ ప్రముఖ మోడల్, నటి అదితి గోవిత్రికర్ (‘తమ్ముడు’ సినిమాలో లవ్లీ ప్రాతలో నటించారు)కి సోదరి.