తెలుగు స్టార్ హీరోలు ఎంత స్పీడ్ పెంచినా సంవత్సరానికి చేసేదే ఒక్క సినిమానే. నిజానికి ఫలానా స్టార్ హీరో నుండి సంవత్సరానికి ఆ ఒక్క సినిమా కూడా కచ్చితంగా వస్తుందని నమ్మకంగా చెప్పలేని దౌర్భాగ్యం టాలీవుడ్ ది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చింది. దాంతో సినిమాలు ఇంకా ఆలస్యం కానున్నాయి. అయితే కరోనా ప్రభావం తగ్గాక మన స్టార్స్ స్పీడ్ పెంచాలనేది సగటు అభిమాని కోరిక. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజండరీ హీరోలంతా జయాపజయాలకు అతీతంగా సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది సినిమాల్లో నటించేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఓ ఏడాదిన ఏకంగా పదిహేను సినిమాలకు పైగానే చేశారట. ఒక్క కృష్ణనే కాదు అప్పటి హీరోలందరూ రోజుకి మూడు నుంచీ నాలుగు కాల్షీట్లు ఇచ్చేవాళ్లు, అలాగే పనిచేసేవాళ్లు . కానీ ఇప్పటి స్టార్స్ గ్యాప్ లేకుండా రోజుకి ఒక్క కాల్షీట్ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం.
కానీ స్టార్ హీరోలు ఎక్కువ చిత్రాలు చెయ్యడం వల్ల మూస ధోరణికి బ్రేక్ వేస్తూ.. స్టార్ల అనే రొటీన్ ఇమేజ్ చట్రాల మధ్య నలిగిపోకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను అందుకుని అందర్నీ ఆకట్టుకోవచ్చు. సినిమా సినిమాకి ఫ్యాన్స్ ను పెంచుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ ఇలానే చేశారు. ‘పాతాళ భైరవి’ లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. ‘పిచ్చి పుల్లయ్య’ ‘కలసి ఉంటే కలదు సుఖం’ లాంటి అచ్చ కుటుంబ కథా సినిమాలతో వెండి తెర పై పచ్చని తెలుగు దనాన్ని అద్దారు. అలాగే ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్ లంతా ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్లే విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన చిత్రాల్లో నటించి తమకంటూ ఒక బాణీని ఏర్పర్చుకోగలిగారు. అందుకే అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అందుకే ప్రతి స్టార్ హీరో ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది.