Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా.? 2019 నుంచే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారా.? ఆగస్ట్ 19న ఆయన్ని హతమార్చేందుకు ప్రయత్నించారా.? ఎన్నెన్నో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.. ఓ న్యూస్ ఛానల్ కథనాల పుణ్యమా అని, ఈ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది.
ఏకంగా 250 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారన్నది సదరు ఛానల్ తెరపైకి తెస్తున్న కథనాల సారాంశం. ప్రధాన రాజకీయ పార్టీలకు కొమ్మ కాయకపోయినా, జనసేన పార్టీకి కొంత ‘ప్రో ఛానల్’ అన్నట్లుగా సదరు ఛానల్ వ్యవహరిస్తోంది. ఆ చానల్ ఈ బ్రేకింగ్ వార్తని ప్రచారంలోకి తెచ్చింది.
ఇంకోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో నివాసం వుంటోన్న ఇంటి యెదుట కొందరు రెక్కీ నిర్వహిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగడం, పవన్ కళ్యాణ్ మీద దూషణలకు దిగడంపై జనసేన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదుని అందుకున్నారు కూడా.
కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే జనసేనాని హత్యకు 250 కోట్ల సుపారీ.. అంటూ వార్తా కథనాలు రావడంతో జనసేన శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. హైద్రాబాద్‌లోని పవన్ ఇంటికి తాము రక్షణగా వుంటామంటూ పలువురు జనసైనికులు హైద్రాబాద్ బయల్దేరారు కూడా.
అయితే, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలనీ, పోలీసులకు ఫిర్యాదు చేశామనీ, జడ్ ప్లస్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని జనసేన పార్టీ చెబుతోంది.