ఓ పార్టీకి.. ఆ పార్టీకి చెందిన నాయకుడికి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఓ ప్రభుత్వానికీ.. ఆ ప్రభుత్వాన్ని నడుపోతున్న పార్టీలోని ఓ ఎంపీకీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో గెలిచేదెవరు.? ఆయనెవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎన్నికల్లో గెలిచేందుకోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజుకి దేవుడిలా కనిపించారు. అప్పట్లో వైఎస్ జగన్ క్రిస్టియన్.. అని రఘురామ గుర్తించలేకపోయారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యాన్ని ఆయన తెలుసుకోలేకపోయారు. అసలు నమ్మేలా వున్నాయా ఇవన్నీ.? అన్నీ తెలిసే రఘురామ వైసీపీలో చేరారు.. వైసీపీ అండదండలతో నర్సాపురం ఎంపీగా గెలిచారు. కానీ, ఆ తర్వాతే కథ మారిపోయింది. ప్రభుత్వమ్మీద అవాకులు చెవాకులు పేలారు. ముఖ్యమంత్రి మీద విరుచుకుపడ్డారు. కులాల కుంపట్లను రాజేశారు. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో రాజకీయాలు చేశారు, చేస్తున్నారు కూడా.
ఇవన్నీ చేసి, ప్రియతమ ముఖ్యమంత్రి.. అంటూ తాను పార్టీని వ్యతిరేకించలేదంటున్నారు. పార్టీ బాగు కోసమే ప్రయత్నిస్తున్నానంటున్నారు రఘురామ. అదే మరి, ఆయనలోని తెలివితేటల గొప్పతనం. రాజద్రోహం కేసు నమోదయ్యింది.. ఇంకా చాలా ఆరోపణలు ఆయన మీదున్నాయి. రాజద్రోహం కేసుకు సంబంధించి, తాజాగా మరిన్ని కొత్త కోణాలు తెరపైకొస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో రఘురామ కుమ్మక్కయ్యారంటూ దానికి కొన్ని ఆధారాల్ని చూపిస్తోంది వైసీపీ, వైసీపీ ప్రభుత్వం. మరి, ఈ ఆధారాలు న్యాయస్థానం ముందర నిలబడతాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వైసీపీకి చేటు చేస్తున్న విషయమేంటో తెలుసా.? పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను తమ వెంట తిప్పుకుంటూ, చంద్రబాబుని తిట్టిస్తుండడం. వారితో పోల్చితే రఘురామనే బెటర్. టీడీపీ పంచనగానీ, బీజేపీ పంచనగానీ చేరలేదింకా ఆయన. అయినాగానీ, రఘురామ వైఖరి.. అత్యంత దురదృష్టకరం.