2024 ఎన్నికలకు ముందర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు సినిమాలు ఉపయోగపడనున్నాయి రాజకీయంగా.! నిజంగానే ఉపయోగపడతాయా.? అదైతే ఇప్పుడే చెప్పలేం.! గతంలో ‘యాత్ర’ సినిమా చేశారు.. ఇప్పుడు ‘యాత్ర-2’ చేయబోతున్నారు. ఇది 2024 ఎన్నికలకు ముందర విడుదలవుతుందట. ఈ సినిమా కోసం తమిళ నటుడు జీవాతో సంప్రదింపులు జరుపుతున్నాడట దర్శకుడు మహి వి రాఘవ.!
ఇదిలా వుంటే, ‘వ్యూహం’ పేరుతో రామ్ గోపాల్ వర్మ గతంలోనే ఓ సినిమా ప్రకటించాడు. కాదు కాదు, రెండు సినిమాలు తీయబోతున్నట్లు కూడా చెప్పాడాయన. టీడీపీకి వ్యతిరేకంగా ‘‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా.. అలాగే, జనసేన మీద సెటైరికల్‌గా మరో సినిమా చేసిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ.
రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘వ్యూహం’ సినిమాతో వైసీపీకి ఉపయోగమేమీ లేదు. కాకపోతే, వైసీపీ శ్రేణులు ఒకింత సంతోష పడతాయ్ అంతే.! దాంట్లో వుండే కంటెంట్ అలాంటిది.
కానీ, ‘యాత్ర-2’ ఖచ్చితంగా వైసీపీకి ఉపయోగపడేలానే వుంటుంది. ‘యాత్ర’ సినిమా చూసినవాళ్ళకు అది అర్థమవుతుంది. సినిమాలు.. రాజకీయాలు.. వేర్వేరు కాదు. సినిమా కూడా రాజకీయం చేస్తుంది. రాజకీయం కూడా సినిమాని ఆశ్రయించక తప్పడంలేదు.
ఇదిలా వుంటే, జనసేన అధినేత నటించే సినిమాలు.. ఓ జాతర తరహాలో వరుసగా విడుదల కాబోతున్నాయి.. 2024 ఎన్నికల వరకూ.! అందులో ‘హరిహర వీరమల్లు’, ‘వినోదియ సితం’ తెలుగు రీమేక్, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వుంటాయ్.!