ఆ వైకాపా నేతలంతా శాఖాహారులే కానీ…!

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి.. ఫలితాలొచ్చేశాయి. కానీ… ఆ ఎన్నికలు అధికార పార్టీలో సృష్టించిన ప్రకంపణలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. వైసీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ విధానలకు వ్యతిరేకంగా ఓటువేశారని, వారంతా చంద్రబాబుకు సంతలో పశువుల్లా అమ్ముడైపోయారని వైకాపా నేతలు విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు. దీంతో… నలుగురు ఎమ్మెల్యే బహిష్కరణ వివాదం వైసీపీలో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో పార్టీ ఆరోపణలకూ – ఆ నలుగురు బహిషృత ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలకూ ఎక్కడా పొంతన ఉండటం లేదు కానీ… ఈ సందర్భంగా… “అంతా శాఖాహారులే – కుండలో కోడి కూర మాయం” అన్న మాట గుర్తొస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

వివరాల్లోకి వెళ్తే… ఇప్పటికే ఈ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు “ఆత్మ ప్రభోదానుసారం” ఓటు వేశామని చెబుతున్నారు. సీటిచ్చింది వైసీపీ – గెలుపులో తోడుంది వైసీపీ… కానీ… ఆయన ఆత్మప్రభోదానుసారం ఓటేశారంట. కాకపోతే అది వైసీపీకా కాదా అన్నది తెలియదు! కోటంరెడ్డికి ఆత్మ ఉంది.. అంతరాత్మ ఉంది.. అది ఒకటి ప్రభోదించి ఉంటుంది. కాబట్టి… వైసీపీకే ఓటువేశారని కాసేపు అనుకుందాం. అలా ఈ విషయంలో ఉన్న క్లారిటీ సంగతి అలా ఉంచితే… ఇక ఆనం రామనారాయణ రెడ్డి విషయనికొద్దాం. తాను కూడా వైసీపీ నేతకే ఓటు చేశానని.. అధిష్టాణం సూచించినవారికే ఓటు వేశానని చెబుతున్నారు. తాను ఏ నేరం చేయకపోయినా.. బలిచేశారాని వాపోతున్నారు.

ఎమ్మెల్సీ ఓటింగ్‌ లో సీక్రెట్‌ బ్యాలెట్‌ పెడితే.. ఎవరు ఎవరికి ఓటేశారో వైసీపీ నేతలకు ఎలా తెలుసంటూ ఆనం రాంనారాయణరెడ్డి ఎదురు ప్రశ్నిస్తున్నారు. తనను ఓటు వేయమని కూడా అడగలేదని.. అయితే తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తే.. ఇప్పుడు అసత్య ఆరోపణలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. అంటే… ఆనం కూడా ఆత్మప్రభోదానుసారమే వేశారు. వైసీపీ ఓటు అడగలేదని… టీడీపీకి వేశారా? ఆత్మ అదే ప్రభోదించిందా? లేక, సీటిచ్చి గెలిపించుకున్న వైసీపీకే ఓటు వేశారా? ఆనం కే తెలియాలి! సస్పెండ్ చేశారాని ఫీలవుతున్నారంటే… వైసీపీకే ఓటువేసి ఉండి ఉంటారు అనుకుందాం!

ఇక ఉండవల్లి శ్రీదేవి కూడా అదే విషయాన్ని వెళ్లడించారు. “నేను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశాను.. నేను పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశానని చెబుతున్నారు.. నేను ఓటువేసేటప్పుడు బల్లకింద సీసీ కెమేరాలు పెట్టారా” అని ప్రశ్నిస్తున్నారు. అంటే… అంతగట్టిగా చెబుతున్నారంటే… శ్రీదేవి కూడా వైసీపీకే ఓటువేశారన్నమాట! ఇదే క్రమంలో… వైసీపీ నుంచి స‌స్పెండైన ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాను క్రాస్ ఓటింగ్‌ కి పాల్ప‌డ‌లేదని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. అంటే… మేకపాటివారు కూడా వైకాపా అభ్యర్థికే ఓటువేశారన్నమాట!

అంటే… ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికే ఓటువేస్తే… 19 ఓట్ల బలమున్న టీడీపీకి అభ్యర్థికి 23 ఓట్లు ఎలా వచ్చాయి? ఈ నలుగురూ కలిస్తే 151 + 1 + 4 = 156 సీట్ల బలమున్న వైకాపా నుంచి ఒక అభ్యర్థి ఎలా ఓడిపోయారు? నీరు పల్లమెరుగు – నిజం దేవుడెరుగు!!