గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు బాగానే చూసుకున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయినా వంశీ 2019 ఎన్నికల తర్వాత జెండా పీకేశారు. భవిష్యత్తు మీద భయమో లేకపోతే నిజంగానే చంద్రబాబుతో విబేధించారో తెలీదు కానీ వైసీపీని భుజాన వేసుకున్నారు. చంద్రబాబును దుర్మార్గుడనేశారు. ఎవరు పార్టీ పిరాయించినా పెద్దగా ఫీలవ్వని చంద్రబాబు వంశీ పార్టీ మారడాన్ని మారి తననే దూషించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. బయటకు చెప్పి వంశీని మరీ పెద్దవాడిని చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ మనసులోనే అనాల్సినవి అనేసుకున్నారు.
ఆయన కోరికలకు అంత బలం ఉందో ఏమో కానీ నాని కష్టాల్లో పడిపోయారు. పవర్ పాలిటిక్స్ చేయాలనుకున్న వంశీ వైసీపీ మీద పెత్తనం స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే తానే కాబట్టి గన్నవరం వైసీపీ నాయకులు, శ్రేణులు తనకు లోబడే ఉండాలన్నట్టు వ్యవహరించారు. దాంతో ఖంగుతిన్న యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా రామచంద్రరావు రివర్స్ అటాక్ చేశారు. వంశీని పార్టీలో ఇమడనివ్వలేదు. ఆయన పెత్తనాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఎన్నో ఏళ్లు కష్టపడి గన్నవరంలో పార్టీని బలోపేతం చేసుకుంటే ఇప్పుడు వంశీ వచ్చి మొత్తాన్ని తన అదుపాజ్ఞల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారు. స్వయంగా జగన్ కలుగజేసుకుని సర్ది చెప్పినా ఫలితం లేదు. ఉప్పు నిప్పులానే ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో వంశీ వైసీపీ టికెట్ ఆశిస్తుంటే మనిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ రావాలని, వంశీకి వెళ్లకుండా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా వంశీకి వెనకడుగు వేయట్లేదు. వంశీ సైతం అంతా నాదే అన్నట్టు ఆ ఇద్దరినీ పట్టించుకోకుండా వ్యవహరించారు. అయినా దుట్టా, యార్లగడ్డ లొంగలేదు. ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తామని, గన్నవరంలో పార్టీ మీద సర్వ హక్కులు మావని తేల్చిపారేశారు. ఈ గొడవ మూలంగా వైసీపీ శ్రేణులు చెల్లాచెదురైపోయాయి. ఇది గమనించిన సొంత వారిని కష్టపెట్టడం ఎనుకనుకున్నారో ఏమో కానీ వంశీకి సహకరించట్లేదు. మధ్యవర్తిత్వానికి కూడ పార్టీ తరపున ఎవ్వరూ వెళ్ళలేదు. జగన్ సైతం ఇదంతా చూసి చెప్తే ఎవ్వరూ వినేలా లేరే అనుకుంటూ లైట్ తీసుకునేశారట. దీంతో గత కొన్ని నెలలుగా పార్టీల్లో వంశీ ప్రాభవం తగ్గింది. అలా వైసీపీలోకి వెళ్లి ఏదో చేద్దామనుకున్న వంశీ చివరికి వైసీపీ చేతిలోనే నలిగిపోతున్నారు.