ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పింపగన్.. అంటారు. శ్రద్ధగా చెప్పాలే గాని ఈ అవనిపై మహిళలు నేర్చుకోలేని విద్య ఉంటుందా! వారికి అవకాశం, ప్రోత్సాహం ఇవ్వాలే గాని ఏ రంగంలో అయినా దూసుకుపోతారు. తమకు అవకాశం ఇచ్చిన వారు గర్వపడేలా చేస్తారు. వారికి కష్టకాలంలో అంది వస్తారు. కొందరికి రోల్ మోడల్ గా నిలుస్తారు. ఎందరికో ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రాజకీయ ప్రస్థానం.
పిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఒక ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుతం ఆమె ప్రతిపక్షపాత్రను పోషిస్తున్న తీరు యువ రాజకీయవేత్తలకు మార్గదర్శకం అంటే అతిశయోక్తి కాదు. శాసనమండలిలో మాట్లాడినా, పార్టీ సమావేశాల్లో ప్రసంగించినా, మీడియా సమావేశాల్లోనైనా ఆమెకు ఒక ప్రత్యేక ముద్ర, శైలి ఉంటుంది. తాను చెప్పదల్చుకున్న అంశాన్ని సూటిగా, స్పష్టంగా చెబుతారు. ఆమె మాట్లాడే తీరును బట్టి ఆ అంశానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి వచ్చారు అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయి కష్టకాలంలో ఉన్న ఈ దశలో ఆమె పార్టీ తరఫున పోరాడుతున్న తీరు ప్రశంసనీయం.
పార్టీ అధికారం కోల్పోగానే ఐదేళ్లు పదవులు అనుభవించిన పలువురు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. పార్టీ ఇచ్చిన రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేతలు కూడా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండగా అనేక పదవులు అనుభవించిన నాయకులు కూడా ఈ విధంగా జంప్ చేశారు. అందులో వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి మహిళా నాయకులు కూడా ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లో, ప్రలోభాలో తెలియదు గాని ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించిన నాయకులు ఈ విధంగా జంప్ చేయడం పార్టీకి ఇబ్బంది కరం. ఇలాంటి దశలో ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాక పార్టీ తరపున బలమైన వాణిని వినిపిస్తున్న వరుదు కళ్యాణిని వైయస్సార్సీపి లోని వారే కాక రాజకీయ పరిశీలకులు కూడా అభినందిస్తున్నారు.
ఎమ్మెల్సీగా ప్రతిపక్ష వాణిని శాసనమండలిలో వినిపించేటప్పుడు కాని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటప్పుడు కాని ఆమె హుందాగా ప్రశంగించే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల శాసనమండలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె ప్రసంగించిన తీరు, మంత్రి లోకేష్ ను ఇరుకునపెట్టిన చాణక్యం పార్టీలో పలువురిని ఆకర్షించింది. అలాగే బయట మీడియా సమావేశాల్లో కూడా ఆమె ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ చేసే సహేతుక విమర్శలు అధికార పార్టీ నాయకుల్ని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. పార్టీ కోసం అటు శాసనమండలిలో ఇటు బయట ఒక ఆడ పులిలా పోరాడుతున్న ఆమెను పార్టీ గుర్తించాలని, భవిష్యత్తులో ఇటువంటి వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని నాయకులు కోరుతున్నారు. పార్టీలో యువతకు ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఆమె రాజకీయ ప్రస్థానం కూడా పేర్కొనదగినది.
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామంలో 1979 ఆగస్టు 30న జన్మించిన ఆమె బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ లను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. వెలమ సామాజిక వర్గ నాయకుడిగా, సంఘ సేవకుడిగా పేరు పడ్డ ఆమె తండ్రి వరుడు బాబ్జీరావ్ ప్రోత్సాహంతో ఆమె 2001లో టిడిపిలో చేరారు. అదే సంవత్సరం సార్వకోట జడ్పిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీని వీడి కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీలో శ్రీకాకుళం మహిళా రాజ్యం కన్వీనర్ గా నియమితురాలయ్యారు. 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆమె 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆమె శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా, అరకు పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించి చక్కని పనితీరును కనబరిచారు. 2019 ఎన్నికలకు ముందు ఆమె అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఈ కారణంగా ఎన్నికల్లో ఆమెను అనకాపల్లి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని పార్టీ ఒక దశలో ఆలోచించింది కూడా.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఆమె విశాఖ ఉత్తర నియోజకవర్గ పర్యవేక్షకురాలుగా పనిచేశారు. పార్టీకి ఆమె అందించిన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2021 నవంబర్ 12న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె 2021 డిసెంబర్ 8న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మహిళగా ఆమె సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆమె రెండు చేతులా అందిపుచ్చుకొని పార్టీ కోసం పనిచేస్తున్న తీరు అటు పార్టీ అధిష్టానాన్ని ఇటు జనాన్ని ఆకర్షిస్తోంది అనడంలో సందేహం లేదు.
వైయస్సార్సీపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కష్టకాలంలో ఆదుకునే ఇటువంటి వారిని ప్రోత్సహించాలని, రీజనల్ కోఆర్డినేటర్ ల పై ఆధారపడి పార్టీని నడిపితే ఎలా ఉంటుందో గత ఎన్నికలు రుజువు చేశాయని పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జీలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.
పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు డైరెక్ట్ యాక్సిస్ ఉండాలి. జిల్లా అధ్యక్షులకు,నియోజక వర్గ ఇంచార్జీలకు సమన్వయం అవసరం. నియోజకవర్గ ఇంచార్జీలకు,మండల కన్వీనర్లకు మధ్య చక్కటి సమన్వయం ఉండాలి. మండల కన్వీనర్లకు,గ్రామ పంచాయతీ నాయకులకు..బూత్ స్థాయి కమిటీ నాయకులకు..నియోజక వర్గ స్థాయిలో ఉన్న 21పార్టీ అనుబంధ సంఘాలను సమన్వయం చేసు కోవాలి. ఈ విధంగా పటిస్టమైన కార్యకర్తలను,నాయకులను తయారు చేసుకుంటే పార్టీ పునాది గట్టిగా ఉంటుంది.
అలాగే జగన్ మోహన్ రెడ్డి ముందు వినే గుణం నేర్చుకోవాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. జిల్లా,మండల నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు స్థానిక నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, పార్టీ నాయకత్వం చేసే తప్పులు, నెగిటివ్ అంశాలు చెబితే వినాలి. భజనపరులను దూరం పెట్టాలి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అప్పుడు వరుదు కళ్యాణి లాంటి అంకితభావం కలిగిన నాయకులు పార్టీలో పుట్టుకొస్తారు. పార్టీ కొత్త జవసత్వాలతో 2029 ఎన్నికలకు సిద్ధం కాగలుగుతుంది అని వైయస్సార్ కాంగ్రెస్ అభిమానులు సూచిస్తున్నారు.