ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయం గురించి ఎక్కువగా చర్చిస్తే ఆ వ్యక్తికి, ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టే లెక్క. ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే ఆ వ్యక్తి, ఆ విషయం ముఖ్యమైనవి, విలువైనవి అనే కదా అర్థం. నారా లోకేష్ విషయంలో ఇదే చేస్తున్నారు వైసీపీ నేతలు. పడే పడే ఆయన పేరును, ప్రస్తావనను తీసుకొచ్చి ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తున్నారు. లోకేష్ ఏం చేసినా అది తోలుమందం వ్యవహారమే అన్నట్టు చూపెట్టాలనేది వైసీపీ నేతల తాపత్రయం. ఇది అన్ని పార్టీలకూ ఉండేదే. కానీ లోకేష్ విషయంలో వైసీపీకి బాగా ఎక్కువగా ఉంది. లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఆయన్ను జనం పెద్దగా పట్టించుకోవట్లేదని రూఢీ అయిపోయింది.
అలాంటప్పుడు ఆయన్ను ప్రచారానికి దూరం పెడితే జనం మర్చిపోయే అవకాశం ఉంది. కానీ వైకాపా అలా చేస్తే కదా. లోకేష్ మౌనంగా ఇంట్లో కూర్చొని ఉన్నా ఆయన జపమే చేస్తుంటారు. గత లాక్ డౌన్ సమయంలో లోకేష్ హైదరాబాద్లోని ఇంటికే పరిమితమయ్యారు. ఆయనలో మూమెంట్ అస్సలు లేదు. ఆ సమయంలో ఆయన్ను జనం మర్చిపోయేవారే. కానీ వైసీపీ లీడర్లు తిడుతూ ఆయన్ను జనాల మధ్యలో నిలబెట్టారు. లోకేష్ ఏమీ చేయకపోతేనే అంత రచ్చ చేసిన వాళ్లు ఇక అయన ఏమైనా చేస్తే ఊరుకోరు కదా. అది తప్పు, ఇది తప్పు, మాటల్లో స్పెల్లింగ్ మిస్టేకులున్నాయ్ అంటూ వెక్కిరింతలు.
తాజాగా లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆకివీడులో ట్రాక్టర్ నడిపారు. పొరపాటున ఆ ట్రాక్టర్ పక్కనున్న కాల్వలోకి ఒరిగింది. దాన్ని పట్టుకుని వైసీపీ జనం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా మంత్రులు, రాజ్యసభ సభ్యుల స్థాయి నేతలు కూడ లోకేష్ ట్రాక్టర్ నడుపుతుంటే కాల్వలో పడబోయింది అంటూ కాసేపు జోకులు వేశారు. ఇక వారి అనుకూల మీడియా దాన్ని పెద్ద తప్పు అన్నట్టు ప్రాజెక్ట్ చేశాయి. పోలీసులైతే ఆయనపై కేసులు నమోదుచేశారు.
దీంతో అందరికీ లోకేష్ ట్రాక్టర్ నడపడం మీద ఆసక్తి రేగింది. వెతుక్కుని మరీ విషయాన్ని తెలుసుకుని అలా జరిగిందా అని కాసేపు నవ్వుకున్నా తర్వాత ఆరాతీసి ఆయన ముంపు ప్రాంత రైతులను పరామర్శించడానికి వెళ్ళాడని తెలుసుకుని పర్వాలేదు.. బాధ్యతను తెలుసుకున్నాడు అంటూ చివర్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలా లోకేష్ ట్రాక్టర్ కాల్వలోకి దిగితే వైసీపీ వాళ్ళు లోకేష్ ముగ్గులోకి తెలీకుండానే దిగిపోయారు.