Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమరావతి ఉద్యమ సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన తాజాగా సత్తెనపల్లి కోర్టుకు హాజరయ్యారు. మహిళా ఉద్యమకారిణి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేశ్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరిపై పోలీసులు 2020లోనే కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో అరెస్టులు జరగలేదు.
అంతకుముందు వెలగపూడికి చెందిన మరియమ్మ కేసులో 145 రోజుల పాటు జైల్లో ఉన్న సురేశ్, అనారోగ్య కారణాలతో ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు ఆయనకు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. ప్రత్యేకంగా అమరావతి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో దర్యాప్తులో వేగం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నందిగం సురేశ్ కోర్టులో లొంగిపోయారు.
తన తరఫున ముందస్తు బెయిల్ కోసం న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తనపై ఉన్న కేసులు ఉద్దేశపూర్వకంగానే వేగంగా నడుస్తున్నాయన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వరుస కేసుల్లో చిక్కుకున్న సురేశ్, రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కోర్టులో ఈ కేసులపై ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.