గత కొన్నిరోజులుగా వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొంత మౌనంగా ఉన్నారు కానీ గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎన్నెన్ని దుమారాలను రేపాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొడాలి నాని, వెల్లంపల్లి, ఇంకొందరు నేతలు మాట్లాడిన మాటలు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ప్రత్యర్థుల విషయంలోనే కాదు కోర్టుల వ్యవహారం కూడ కొందరు వైసీపీ లీడర్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. డాక్టర్ సుధాకర్ వివాదం నుండి పలు అంశాల్లో ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేక తీర్పులు రావడం వరకు పలువురు లీడర్లు జడ్జీల మీద నోరుజారారు. దాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ప్రజాప్రతినిధులే ఇలా కోర్టులను కించపరిస్తే సామాన్య జనంలో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నందిగం సురేష్, తమ్మినేని సీతారాం, విజయసాయిరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ లాంటి నాయకులు కొంచెం ఎక్కువే మాట్లాడారు. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మొదట్లో సీబీఐ కొంచెం నెమ్మదిగా ఉన్నా మధ్యలో హైకోర్టు అదిలించడంతో వేగం పెంచింది. గత నెలలో కోర్టు ధిక్కరణ కేసులో ఆమంచి, నందిగం సురేష్ లకు నోటీసులు పంపింది. తాజాగా ఆమంచిని ఈ నెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇతర నాయకుల్లో గుబులు మొదలైంది. సీబీఐ నోటీసులతో సహా గతంలో హైకోర్టు నుండి నోటీసులు అందుకున్న నాయకులంతా కంగారుపడుతున్నారు. ఇవ్వాలో రేపో వారికి కూడ నోటీసులు అందుతాయని అంటున్నారు.
ఈ లిస్టులో అధికార పార్టీ నాయకులే కాదు కార్యకర్తలూ ఉన్నారు. ఇలా మొత్తం 49 మందికి నోటీసులు వెళ్లాయి. కోర్టులను కించపరుస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారనేది వీరి మీదున్న అభియోగం. నోటీసులు అందుకున్న వెంటనే కార్యకర్తలు లబోదిబో మంటూ వైసీపీ సోషల్ మీడియా హెడ్ విజయసాయిరెడ్డిని ఆశ్రయించగా ఆయన సోషల్ మీడియా సైనికులతో పెద్ద మీటింగ్ పెట్టి ఎవ్వరూ భయపడబద్దని, అందరికీ కోర్టు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభియోగం మోపబడిన వారంతా నేరస్తులు అయిపోరని, నేరం రుజువు కాకపోతే ఇన్నొసెంట్స్ అవుతారని లా సత్యాన్ని ఉటకించారు. మరి ఇప్పుడు నాయకులు అందుకున్నట్టే సీబీఐ నుండి రేపు కార్యకర్తలు అదే విజయసాయిగారు అంటున్నట్టు ఆ ఇన్నోసెంట్స్ ఎవరైనా నోటీసులు అందుకుంటే న్యాయపరమైన సహాయం చేస్తారేమో చూడాలి.