చంద్రబాబునాయుడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంతకు ముందు వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనంటూ వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే, వైఎస్ వివేకానందరెడ్డి మతం మార్చుకుని, పేరు కూడా మార్చుకున్నారని వైసీపీ చెప్పిందో.. రెండో పెళ్ళి కారణంగానే ఆయన హత్యకు గురయ్యారని వైసీపీ ప్రచారం చేయడం మొదలు పెట్టిందో.. అప్పుడే చంద్రబాబుకి వైసీపీ క్లీన్ చిట్ అయ్యింది.

గతంలో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఈ హత్య కేసు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. రాజకీయంగా ఇబ్బంది పెట్టింది కూడా. కానీ, ఇకపై ఆ పాపాన్ని టీడీపీ మోయాల్సిన పనిలేదు. రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ, ఎలా టీడీపీకి ఈ విషయంలో క్లీన్ చిట్ ఇవ్వగలిగింది.? అన్నదే ఇక్కడ హాట్ టాపిక్.

విషయం తన దాకా వచ్చేసరికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ప్లేటు ఫిరాయించేశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి. అవినాష్ రెడ్డి ప్రకటన ఓ యెత్తు.. దాన్ని వైసీపీ భుజాన మోస్తున్న తీరు ఇంకో యెత్తు.! ఈ క్రమంలో వైసీపీ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

రేప్పొద్దున్న వైఎస్ షర్మిల మీద కావొచ్చు, వైఎస్ విజయమ్మ మీద కావొచ్చు.. అవసరమైతే ఈ తరహా నిందారోపణల్ని వైసీపీ చేయిస్తుందా.? అన్న అనుమానాల్ని రాజకీయ ప్రత్యర్థులు వేసే అవకాశాన్ని వైసీపీనే కల్పించింది.