26 న వైసిపి శాసనసభా పక్ష సమావేశం..రాజీనామా చేయనున్న చంద్రబాబు

ఈనెల 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసిపి శాసనసభా పక్ష సమావేశం జరగబోతోంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్షం నేతగా ఏకగీవ్రంగా ఎన్నుకోనున్నారు. బహుశా 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.

ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుండే బ్రహ్మాండమైన మెజారిటితో దూసుకుపోతున్న వైసిపి మరో మూడు గంటలు కాగానే అధికారంలోకి రావటం ఖాయమని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసిపి 151 నియోజకవర్గాల్లో మెజారిటీతో కొనసాగుతోంది. దాదాపు ఇదే ట్రెండ్స్ కంటిన్యు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అదే సమయంలో మొత్తం 25 లోక్ సభ సీట్లకు గాను వైసిపి 24 పార్లమెంటు నియోజకవర్గాల్లో మంచి లీడ్స్ తో కొనసాగుతోంది. బహుశా ఇదే అంతిమ ఫలితం కూడా కావచ్చేమొ. ఓటమి ఖాయమని తేలిపోయిన తర్వాత చంద్రబాబునాయుడుకు కూడా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నారు. రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం.