కడప వైసిపిలో అనూహ్య మార్పు

వైసిపిలో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. కడప ఎంపీ సీటుకి అభ్యర్థుల మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఆ స్థానంలో అభ్యర్థిని మార్చాలనే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డికి వివాదరహితుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయనను అసెంబ్లీకి పోటీ చేయించనున్నట్టు రాజకీయవర్గాల్లో వినికిడి. కానీ ఎక్కడి నుండి చేయిస్తారు అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది.

కడప రాజకీయాలను చక్కబెట్టగల, వైసిపి కంచుకోటగా ఉన్న కడపలో పార్టీని మరింత పటిష్టపరిచే నాయకుడిని ఆ స్థానంలో నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఎంపీగా పోటీ చేయడానికి షర్మిల బరిలోకి దిగనుంది అనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ స్థానానికి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పేరు వినబడటం గమనార్హం. రానున్న ఎన్నికల్లో అవినాష్ రెడ్డి కాకుండా కడప ఎంపీ సీటుకి వివేకానందరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ ఈ సీటు నుండి తప్పుకున్నాక రెండుసార్లు ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు కూడా. ఆయనకు కడప రాజకీయాలపై మంచి పట్టు ఉంది. 

1999 ఎన్నికల్లోనూ, 2004 ఎన్నికల్లోనూ వివేకానందరెడ్డి ఇదే సీటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2009 లో వైఎస్ జగన్ ఈ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2011 లో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ జగన్ విజయం సాధించారు.సెప్టెంబరు 2009 లో వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. నవంబరు 30, 2010 న ఆయన ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2011 లో జరిగిన బై ఎలెక్షన్స్ లో తన సోదరుడు వైఎస్సార్ భార్య విజయమ్మకు వ్యతిరేకంగా పులివెందుల శాసనసభకు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో విజయమ్మ చేతిలో పరాజయం పాలయ్యారు. వైసీపీ ఫార్మేషన్ కోసం 2011 లో ఉపఎన్నికలకు దిగిన జగన్ కు వ్యతిరేకంగా వివేకానందరెడ్డిని పురమాయించింది కాంగ్రెస్. కానీ వివేకాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు వివేకానందరెడ్డి.

2014 ఎన్నికల్లో జగన్ పులివెందుల నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేయగా కడప ఎంపీ సీటుకు అవినాష్ రెడ్డిని నిలబెట్టారు. ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి ఆ స్థానానికి వివేకానందరెడ్డిని బరిలోకి దింపాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. అవినాష్ రెడ్డిని మరో సీటుకు పోటీ చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

జగన్ ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా వివేనంద కోసం కడప ఎంపీ సీటు నుండి తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ అభ్యర్థులను మార్చిన చోట సదరు సీట్లపై ఆశలు పెట్టుకున్న వైసిపి నేతలు అసంతృప్తికి లోనయ్యారు. మరి ఈ విషయాన్నీ అవినాష్ రెడ్డి ఎలా స్వీకరిస్తారో అని హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో.