వైఎస్ వివేకానంద రెడ్డి డెత్ మిస్టరీ ఎప్పటికి వీడుతుంది.? ఏళ్ళ తరబడి సీబీఐ ఓ కేసులో ఇంతలా కిందా మీదా పడుతోందంటే, ఈ క్రమంలో సీబీఐ మీదనే అనుమానాలు వస్తున్నాయంటే దానర్థమేంటి.?
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ కేసులో సీబీఐ టార్గెట్ చేసిందన్నది వైసీపీ ఆరోపణ. ‘సీబీఐ చిల్లర వేషాలు వేస్తోంది’ అని స్వయానా వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి చెందిన ఇతర నేతలెవరైనా ఈ వ్యాఖ్యలు చేస్తే అదో లెక్క. కానీ, ప్రభుత్వ సలహాదారు ఇలా మాట్లాడవచ్చా.? అన్నట్టు, ఆయనెప్పుడో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేశారు, అవినాశ్ రెడ్డిని నిర్దోషిగా ప్రకటించేశారు. అయితే, ఆయన ఏ కోర్టుకూ న్యాయమూర్తి కాదుగనుక, ఆయన తీర్పు చెల్లదు.
ఇక, తాజాగా అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. న్యాయస్థానం తీర్పుని ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా కఠిన చర్యలు వద్దంటూ సీబీఐకి ఆదేశించింది న్యాయస్థానం. కఠిన చర్యలు అంటే ఏంటి.? అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు అసలంటూ సీబీఐ సీరియస్‌గా ప్రయత్నిస్తేనే కదా.?
అరెస్టు చేసే ఉద్దేశ్యం సీబీఐకి ఏమాత్రం వున్నా, ఈపాటికే అవినాశ్ రెడ్డి అరెస్టయ్యేవారు. అరెస్టు కాకుండా అవినాశ్ రెడ్డికి ఈ నెల 31 వ తేదీ వరకు ఊరట కలిగిందని ఎవరైనా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.