వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: సీబీఐ విచారణ ఓ డ్రామా.?

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే వుంది. ఏళ్ళ తరబడి జరుగుతున్న ఈ విచారణలో దోషులెవరన్నది మాత్రం తేలడంలేదు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

నాలుగేళ్ళు గడిచిపోయాయ్.. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఓ ఏడాదిలో. ప్రభుత్వం మారుతుందా.? మారదా.? అన్నది వేరే చర్చ. వైఎస్ వివేకా హత్య, 2019 ఎన్నికలపై ప్రభావం చూపిందన్నది నిర్వివాదాంశం. మరి, 2024 ఎన్నికల్లోనూ వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం ప్రభావం చూపుతుందా.? చూపితే, ఈసారి ఎవరికి రాజకీయ లబ్ది చేకూరుతుంది.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలో కనిపిస్తోంది.

ఇదిలా వుంటే, సీబీఐ విచారణ పేరుతో జరుగుతున్నదంతా ‘డ్రామా’ అని తేల్చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దాంతో, అంతా అవాక్కవుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణ కావాలని అడిగిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల సమయంలో ఢిల్లీ వరకూ వెళ్ళి, సీబీఐ విచారణ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, అధికారంలోకి వచ్చాక మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని వైసీపీ చెప్పడం, కోర్టుకు సైతం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా అదే చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనం.

రాష్ట్ర పరిధిలో దర్యాప్తు సంస్థల్ని రాష్ట్రంలోని అధికార పార్టీలు, జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థల్ని దేశంలో అధికారంలో వున్న పార్టీలు ‘వాడుకోవడం’ అనే ఆరోపణ ఈనాటిది కాదు. సీబీఐ విచారణ డ్రామా అయితే, ఏపీ సీఐడీ విచారణల్ని కూడా డ్రామాలుగానే పోల్చాల్సి వస్తుందేమో.! సజ్జల లాంటి విజ్ఞులు ఇలా తొందరపాటు వ్యాఖ్యలు చేస్తే ఎలా.?