లాజిక్ మిస్సవుతున్న సునీత… లక్ష్యం మిస్సవుతుందా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొన్న, నిన్న, రేపు కూడా ఏపీలో హాట్ టాపిక్ గానే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయిన అనంతరం ఈ వ్యవహారం మరీ రసభాసగా మారడంతో పాటు… వైఎస్ సునితారెడ్డి లక్ష్యం మారుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో సీబీఐ విచారణకు హాజరవుతున్న క్రమంలో, అవినాష్ తల్లి గుండెపోటుకు గురయ్యారనే సమాచారంతో కడపకు బయలుదేరారు అవినాశ్ రెడ్డి. అనంతరం కర్నూల్ లోని ఆసుపత్రికి అవినాశ్ తల్లిని చేర్చారు. ఈక్రమంలో ఆమెను కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచడం జరిగింది. తల్లికి చికిత్స జరుగుతున్న కారణంగా.. కొన్ని రోజులు విచారణనుంచి మినహాయింపు కావాలని అవినాష్ సీబీఐ అధికారులను కోరారు!

అయితే ఈ విషయాలపై వైఎస్ సునీత తాజాగా ఒక మెమో దాఖలు చేశారు. అవినాష్ తల్లికి శస్త్ర చికిత్స జరగలేదని, సర్జరీ జరుగుతున్నట్టుగా ఆయన కోర్టుకు అబద్ధం చెప్పారని, కాబట్టి ఆయన మీద, ఆయన లాయర్ మీద కోర్టు చర్యలు తీసుకోవాలని ఆమె మెమోలో పేర్కొన్నారు. దీంతో… సునీత లక్ష్యం మారుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నారు పులివెందుల ప్రజానికం!

తన తండ్రిని చంపిన వారిని కటకటాల వెనక్కు పంపి తీరుతానని సునీత ప్రతిజ్ఞ తీసుకోవడంలో న్యాయముంది.. అంతకంటే ముందు బాధ్యత కూడా ఉంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలని ఆమె చేస్తున్న పోరాటం అభినందించదగినది కూడా…! ఈ సమయంలో ఆమె పోరాటాన్ని పార్టీలకు అతీతంతా సమర్ధించేవారూ లేకపోలేదు. కానీ అవినాష్ రెడ్డి తల్లికి వారు చెప్పినట్టుగా శస్త్రచికిత్స జరగలేదు గనుక.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంపై సర్వత్రా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక వైద్యురాలైనప్పటికీ సునీత ఇక్కడ మిస్సవుతున్న లాజిక్ ఒకటుంది. ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు అవినాశ్ తల్లికి ఆపరేషన్ అవసరం అని వైద్యులు చెప్పి ఉండొచ్చు.. అదే విషయాన్ని అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించి ఉండవచ్చు. అయితే కాస్త ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత సర్జరీ అవసరం లేదని డాక్టరు భావించి ఉండవచ్చు. అయితే ఈ విషయంలో అబద్దం చెప్పారని సునీత వాదిస్తుంది. పైగా అక్కడ సర్జరీ జరిగిందా లేదా అనే విషయానికీ.. వివేకా హత్య కేసుతో ఉన్న సంబంధానికీ ఉన్న సంబంధం ఏమిటో సునీతే చెప్పాలి.

దీంతో… సునీత లాజిక్ మిస్సవ్వడమే కాకుండా… ఆమె ఎంచుకున్న లక్ష్యాన్ని కూడా మిస్సవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది!