గతకొంతకాలంగా వైఎస్ షర్మిళ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎలాంటి ప్రకటన చేసినా.. అది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇదే సమయంలో ఆ నిర్ణయాలపై రకరకాల ఊహాగాణాలు, పలు రకాల విశ్లేషణలు తెరపైకి వస్తుంటాయి. ఇందులో భాగంగా తాజాగా షర్మిళ తీసుకున్న మరో నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ జన్మదినం నాడు తల్లి.. తన కుమార్తె, కుమారుడుతో కలిసి షర్మిల కడప చేరుకున్నారు. ఆ వెంటనే వేంపల్లెలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన ఆస్తులను తన పిల్లలకు బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు. షర్మిల ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.
అవును… ఇడుపులపాయలో తనపుట్టింటి నుంచి తనకు వచ్చిన కొన్ని ఆస్తులను తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలీల పేరుపై వైఎస్ షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో భాగంగా… ఇడుపులపాయలో తన పేరిట ఎన్న 9.53 ఎకరాల భూమిని తన కుమారుడు రాజారెడ్డి పేరిల దాన విక్రయం రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించారు.
ఇదే సమయంలో ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి 2.12 ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె అంజలీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
దీంతో ఇప్పుడు సడన్ గా ఈ స్థాయిలో షర్మిళ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే… తన తండ్రి జయంతికి ఇవి ఆయనే పిల్లలకు ఇస్తున్న కానుకగా షర్మిళ చెబుతున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో షర్మిల రాజకీయంగానూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనేది తెలిసిన విషయమే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మ్మిళ.. సుదీర్ఘ పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు, రాజకీయ పోరాటాలు చేసారు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆఫర్ వచ్చిందని… అయితే ఈ విషయంలో షర్మిళ పొత్తు ప్రస్థావన తెస్తే… కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీన ప్రతిపాదన తెచ్చిందని అంటున్నారు.
అయితే ఈ రోజు వైఎస్సార్ జన్మదినం నాడు తండ్రికి నివాళి అర్పించిన తరువాత షర్మిల హైదరాబాద్ చేరుకున్న అనంతరం తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరు వెళ్లనున్న షర్మిళ.. అక్కడ వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించనున్నారని తెలుస్తుంది. ఈ రోజునే తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారనే కథనాలు ఇప్పటికే బలంగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఈ మేరకు హామీ దక్కినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిళ ఇలా ప్రతీ అడుగు రాజకీయాలవైపు అత్యంత జాగ్రత్తగా వేస్తున్నారని అంటున్నారు.