విలీనం దిశగా వైఎస్ షర్మిల పార్టీ.! సంకేతాలిచ్చేశారుగా.!

అయిపాయె.! తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రస్తానం మూడేళ్ళ ముచ్చటేనేమో.! రేపో మాపో మంచి బేరం చూసుకుని ఏదో ఒక పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల విలీనం చేసేస్తారేమో.!

‘నేను అడిగితే కాంగ్రెస్ పార్టీ కాదంటుందా.? బీజేపీ వద్దంటుందా.? కేసీయార్ కాదనే అవకాశమే లేదు కదా.?’ అంటూ మీడియా ముందు వైఎస్ షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల పెద్ద దిక్కు అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ కూడా ఆమెను హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకోపక్క భారత్ రాష్ట్ర సమితి కూడా షర్మిల సేవల్ని వినియోగించుకోవాలని చూస్తోందట.

మీడియాలో వస్తున్న ఊహాగానాలపై, ‘ఫాల్స్ న్యూస్’ అనేయాల్సిన షర్మిల, ‘నేను వెళతానంటే ఎవరు కాదంటారు.?’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘కస్టపడి పార్టీని పెట్టి, పాదయాత్ర చేసింది.. వేరే పార్టీల్లో విలీనం చేసెయ్యడానికి కాదు’ అని షర్మిల చెప్పుకొచ్చినా, అసలు విషయం వేరేలా కన్వే అవుతోంది.

తెలంగాణలో షర్మిల పార్టీకి నాయకులు లేరు. చూడబోతే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరి, ఆ పార్టీ నుంచి చట్ట సభలకు వెళ్ళాలని షర్మిల అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపే వైఎస్ షర్మిల మొగ్గు చూపబోతున్నారట.