వైఎస్ షర్మిల ‘ ఖండన ‘ బానే ఉంది కానీ .. ‘ ఆ పాయింట్ ‘ లో ఫెయిల్ అయ్యింది ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిలా రెడ్డి అన్న‌కు పోటీగా కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతోంది అంటూ గ‌త రెండు రోజులుగా తెగ ప్ర‌చారం అవుతుంది. త‌నను రాజ‌కీయంగా, ఆర్థికంగా ఎద‌గ‌నీయ‌కుండా చేశాడ‌ని తీవ్ర అసంతృప్తితో ఉన్న షర్మిల సొంతంగా పార్టీ పెట్ట‌బోతోంద‌ని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం సంచ‌లనం రేపింది. అసలు ఇది నిజమా , అబద్దమా అనేది పక్కన పెడితే.. దీని మీద పెద్ద చ‌ర్చే న‌డిచింది.

 

వైసీపీ వ‌ర్గాలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. సాక్షి మీడియా కూడా ఈ క‌థ‌నాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ వార్త‌లిచ్చింది. ఐతే ఈ క‌థ‌నానికి కేంద్రంగా మారిన ష‌ర్మిల నుంచి మాత్రం ఒక రోజు గ‌డిచినా స్పంద‌న లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ష‌ర్మిల సైలెంటుగా ఉందంటే.. ఈ క‌థ‌నం నిజ‌మేనా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే , కొంచెం ఆల‌స్యంగా ష‌ర్మిల ఈ క‌థ‌నంపై స్పందించారు. ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆమె ఖండించారు. ఈ ఆదివారం నాడు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో బ్యాన‌ర్ ఐట‌మ్ ‌గా వ‌చ్చిన ఒక క‌థ‌నం ఆల‌స్యంగా నా దృష్టికి వ‌చ్చింది.

వైఎస్సార్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాత‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ ప‌త్రిక అయినా, ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విష‌యాల‌ను రాయ‌డ‌మే త‌ప్పు. అది నీతి మాలిన చ‌ర్య‌. అటువంటి త‌ప్పుడు రాత‌లు రాసిన ప‌త్రిక‌, ఛానెల్‌ ల మీద న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌బోమ‌ని తెలియ‌జేస్తున్నాను అంటూ ఆమె ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
కాక‌పోతే ఈ క‌థ‌నం ఆల‌స్యంగా త‌న దృష్టికి వ‌చ్చింద‌న‌డం మాత్రం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అలాగే ఈ క‌థ‌నం అబ‌ద్ధం అన‌కుండా దురుద్దేశంతో రాశార‌న‌డం.. న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం అన‌కుండా అందుకు వెనుకాడ‌బోమని పేర్కొన‌డం చూస్తే వైకాపా వ‌ర్గాలు కోరుకున్న స్థాయిలో ష‌ర్మిల స‌ద‌రు క‌థ‌నాన్ని ఖండించ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.