మాస్ వాళ్లకు అర్థం కాదు… మినిమం డిగ్రీ చేసి ఉండాలి!

“మాస్ వాళ్లకు అర్థం కాదు.. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద స్థాయి వాళ్లకు మాత్రమే అర్ధమవుతుంది” అన్నట్లుగా ఉంది ప్రస్తూతం ఏపీలో విపక్షాల తీరు! ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ల వ్యవహారం ఇప్పుడు సామాన్యుడికి అర్ధం కావడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకు కారణం… గతకొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు!

ఏపీలోని విపక్షాల్లో ప్రస్తుతం టీడీపీ – జనసేనలు మాత్రమే పొత్తులో ఉన్నాయి. మిగిలిన కాంగ్రెస్, బీజేపీలు ప్రస్తుతానికి సింగిల్ అనే చెప్పాలి. కాకపోతే… పురందేశ్వరి మాత్రం బీజేపీకి, జనసేనకు పొత్తు ఉందని చెబుతుంటారు. పవన్ మాత్రం తనకు చంద్రబాబుతోనే బాగుటుందని అక్కడే ఉంటున్నారు! మరో పదేళ్ల పాటు కలిసే ఉంటామని బహిరంగంగానే చెబుతున్నారు! అవి పురందేశ్వరికి వినిపించినా.. జనసేనపై ఉన్న అభిమానంతోనో ఏమో కానీ… వినిపించనట్లే ఉంటున్నారు!

ఇక తాజాగా ఏపీలోకి ఎంటరయ్యారు వైఎస్ షర్మిళ. ఈమె ఎంటరయ్యాక ఏపీ కాంగ్రెస్ లో కదలికలు వచ్చాయని.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు. ఇక ఈమె మైకు పట్టుకుంటే కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని వైసీపీని ఉతికి ఆరేస్తున్నారు. ఆ విమర్శల్లో ఎంత హేతుబద్దత ఉంది అనే సంగతి కాసేపు పక్కనపెడితే… కన్ను ఆర్పకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అప్పుడప్పుడూ తగిలీ తగలనట్టుగా చంద్రబాబుని కూడా తమలపాకుతో కొడుతున్నారు!!

అదంతా ఒకెత్తు అయితే… బీజేపీకి షర్మిళ ఏకిపారేస్తుంటే… గుక్కతిప్పుకోకుండా బండకేసి బాదేస్తుంటే… ఏపీలో ముందుగా స్పందించాల్సిన పురందేశ్వరి సైలంటుగా ఉంటున్నారు. టీడీపీతోనే తన ప్రయాణం అని పవన్ మాటలు ఎలా వినిపించనట్లు ఉంటున్నారో.. మోడీని షర్మిల బంతాడుతున్నా కూడా.. తనకూ బీజేపీకి, తనకూ మోడీకి ఏమీ సంబంధం లేదన్నట్లుగా మౌనాన్నే తమ భాషను చేసుకుని కాలం గడుపుతున్నారు!

విభజన అనంతరం ఏపీకి రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ కామెంట్ చేసి.. అనంతరం వారి చంకనెక్కిన పవన్ కల్యాణ్ ను కూడా షర్మిళ ఏమీ అనడం లేదు. హోదాతో ఏమి వస్తుంది? అని ప్రజలను ప్రశ్నించి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ పై షర్మిళ ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. ఇదే సమయంలో… ప్రత్యేక హోదా అనే అంశాన్ని బిల్లులో పెట్టని కాంగ్రెస్ పార్టీని పవన్ ఏమీ విమర్శించడం లేదు!

ఒక్కమాటలో చెప్పాలంటే… పవన్ గురించి షర్మిల మాట్లాడటం లేదు. షర్మిల ఏకిపారేస్తున్నా పురందేశ్వరి నోరు విప్పడం లేదు. షర్మిల గురించి పవన్ ప్రస్థావించడం లేదు. దీంతో… కేంద్రంలో జుట్టూ జుట్టూ పట్టుకుంటున్న బీజేపీ – కాంగ్రెస్ లు ఏపీలో ఇలా తెరవెనుక స్నేహం ఎలా చేస్తున్నాయనేది సామాన్యుడికి అర్ధం కావడం లేదని అంటున్నారు. మరి ఈ రిలేషన్ పై పొత్తుల తర్వాతైనా వీరు నోరు విప్పుతారా.. లేక, ఎన్నికలయ్యాక ఏకంగా ఒకేసారి స్పందిస్తారా అనేది వేచి చూడాలి!