నమ్ముకున్న జనమే నట్టేట ముంచేస్తారు.!

సంక్షేమ పథకాలే ఓటు బ్యాంకుని బలోపేతం చేస్తాయని ఏ పాలకుడు నమ్మినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.! సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తే, ప్రజల్లో కొంతమేర సానుకూలత కనిపిస్తుందన్నది నిర్వివాదాంశం. అయితే, ఆ సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయనుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ప్రజలు మళ్ళీ గెలిపించడానికి సంక్షేమ పథకాలే దోహదం చేస్తాయని బలంగా నమ్ముతున్నారు. ‘మీ బిడ్డ.. మీ బిడ్డ..’ అని పదే పదే నినదిస్తున్నారు. తాజాగా తిరువూరు బహిరంగ సభలోనూ వైఎస్ జగన్ పాత పాటే పాడారు. దాదాపుగా అన్ని బహిరంగ సభల్లోనూ రొటీన్ స్పీచ్‌లు దంచుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కి నిధులు విడుదల చేసేందుకోసం ఈ బహిరంగ సభల్ని నిర్వహిస్తున్నారు. ఇవి రానురాను ఖర్చు దండగ వ్యవహారంగా మారుతున్నాయి.

తెచ్చుకున్న అభిమానులు చేసే నినాదాలకు ముఖ్యమంత్రి పదవిలో వున్నోళ్ళు ఉప్పొంగిపోతే, చంద్రబాబుకి పట్టిన దుస్థితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా రావొచ్చన్న విషయాన్ని వైసీపీలోనే అంతర్గత చర్చ జరగాలి. కానీ, ఆ పరిస్థితి లేదు. అంత సాహసం కూడా ఎవరూ చేయరు. నో డౌట్.. కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. కానీ, అవి ఎంత శాతం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతాయి.? అన్నది కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే కనిపించడంలేదు వైసీపీ అధినాయకత్వంలో.!