వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కోర్ట్ ల నుండి ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హై కోర్ట్, సుప్రీం కోర్ట్ ల నుండి ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ అనే చెప్పాలి. డాక్టర్ సుధాకర్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో, మూడు రాజధానుల విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో ఇలా అనేకసార్లు కోర్ట్ ల నుండి వైసీపీ ప్రభుత్వం ఎదురుదెబ్బలు తింది. ప్రభుత్వం కోర్ట్ ల విషయంలో ఎందుకు ఈ పొరపాట్లు చేస్తుందో తెలియడం లేదు. అయితే ఇప్పుడు మరో కేసులో వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ కేసులో 455 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళటం పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడో 1999లో గుంటూరు జిల్లా, సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసరావు అనే వ్యక్తి, తమను ఒక అధికారి లంచం అడిగారు అంటూ తప్పుడు ఫిర్యాదు చేసారని ఏసిబి కేసు నమోదు చేసింది. దీనికి సవాల్ చేస్తూ, శ్రీనివాసరావు 2007లో అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. 2018లో శ్రీనివాసరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సుదీర్ఘ కాలం తరువాత, సుప్రీం కోర్టు లో ఈ కేసు పై అపీల్ చేసింది.
ఈ పిటీషన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్ కు చెందిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. 455 రోజుల తర్వాత ఎస్ఎల్పీ దాఖలు చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని, ఇలా చేసి సరిదిద్దలేని అసమర్థతను ప్రభుత్వం చూపించిందని, ఈ వైఖరిని తాము ఆక్షేపిస్తున్నామని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ లో ప్రభుత్వం ఎందుకు ఇలా వెనకడుగు వేస్తుందో అర్ధం కావడం లేదు. సరైన న్యాయ నిపుణులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించుకోవలని, లేకపోతే రానున్న రోజుల్లో కూడా జగన్ ఇలా కోర్ట్ ల నుండి ఎదురుదెబ్బలు తినవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.